డీఎల్ కు డీల్ ఓకే అయింది

వచ్చే ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తోంది. నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తకుండా ముందుగా వివిధ ఛైర్మన్ పోస్టులను ఆయన భర్తీ చేసినట్లు కన్పిస్తోంది. టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించడంతో ఎప్పటి నుంచో పార్టీలోకి తీసుకోవానుకుంటున్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డికి మార్గం సుగమమయినట్లే. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జిగా సుధాకర్ యాదవ్ కొనసాగుతున్నారు.

డీఎల్ ను చేర్చుకునేందుకే….

అయితే వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని సుధాకర్ యాదవ్ అనేకసార్లు చెప్పారు. తన అనుచరులతో సమావేశాలు పెట్టి మరీ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయనకు వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టిక్కెట్ ఇవ్వాల్సి ఉంది. కాని మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న సుధాకర్ యాదవ్ ఇందుకు ససేమిరా అనుతుండటంతో డీఎల్ పార్టీలో చేరిక ఆలస్యమయింది.

బాబు గ్రీన్ సిగ్నల్…..

తాజాగా సుధాకర్ యాదవ్ ను టీటీడీ ఛైర్మన్ గా నియమించి ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎల్ రవీంద్ర చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీఎల్ ను పార్టీలోకి తీసుకుంటే కేవలం మైదుకూరు నియోజకవర్గమే కాకుండా కడప జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే పుట్టాను వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పించడానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పుట్టాను ఈమేరకు ఒప్పించి ఆ పదవి ఖారారు చేసినట్లు చెబుతున్నాయి.

త్వరలోనే టీడీపీలోకి…

టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులు కావడంతో ఇక డీఎల్ చేరిక ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే డీఎల్ చేరతారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల పార్టీలో చేరికలు లేక కొంత డీలా పడిపోయింది. ప్రతిపక్ష వైసీపీని సొంత జిల్లాలో దెబ్బ తీయాలంటే డీఎల్ ను వీలయినంత తొందరలో పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద కడప జల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*