ప్రొఫెసర్ పై చంద్రబాబు కన్ను..?

తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగుతోంది. అసెంబ్లీని రద్దు చేసి, 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల వాతావరణానికి తెర లేపారు. వాస్తవానికి అప్పటికి కాంగ్రెస్ సహ ఇతర ఏ పార్టీకి కూడా ఎన్నికలకు సిద్ధంగా లేదు. ఆ మాటకొస్తే ఆ పార్టీలు ఎన్నికలకు ఇప్పటికీ ఇంకా సన్నద్ధం కాలేదు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో పరిగెడుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ మళ్లీ గెలవకూడదని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. కానీ, కాంగ్రెస్ కంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ పట్టుదల ఇంకా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అయినా తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తోనే జట్టు కట్టేందుకు అంగీకరించారు.

వ్యూహాలు పన్నుతున్న చంద్రబాబు

తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉందని, కేసీఆర్ కి బలమైన ప్రత్యర్థి లేరనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. దీంతో టీఆర్ఎస్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని, మహాకూటమి ఏర్పాటు కావాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించిన టీడీపీ, తెలంగాణ ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న కోదండరాంను, కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉన్న సీపీఐ పార్టీలను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు కావాలనే ఆలోచనకు వచ్చారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా కొనసాగాయి. అయితే, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజకీయాలను, ప్రజల అభిప్రాయాలను బాగా అంచనా వేయగలరు. అందుకే మహాకూటమికి ఒక లీడర్ కావాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా…

వాస్తవానికి మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన భూమిక పోషించనుంది. ఆ పార్టీకే ఎక్కువ సీట్లు కూడా కేటాయించనున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలోనే ఒక్క లీడర్ అని చెప్పలేని పరిస్థతిలో మహాకూటమికి లీడర్ ఎవరు అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు సమాధానం వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. లీడర్ లేకుండా కేవలం కూటమితో ఎన్నికలకు వెళితే ప్రజల్లో నమ్మకాన్ని పొందలేరని ఆలోచనలో ఆయన ఉన్నారట. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ కూడా లేవనెత్తి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. పైగా కేసీఆర్ వంటి బలమైన నేతకు ప్రత్యామ్నాయంగా మరో నేత లేనిదే ఫలితం ఉందని భావిస్తున్నారు. దీంతో ఒకవేళ మహాకూటమి ఎక్కువ స్థానాలు గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఇప్పుడే స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తే మహాకూటమి మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందే సీఎంను ప్రకటించే సంప్రదాయం లేనే లేదు. ఉన్నా కేసీఆర్ బలమైన ప్రత్యామ్నాయంగా ఎవరూ కనపడటం లేదు.

ప్రొఫెసర్ అయితేనే సరి..!

దీంతో కోదండరాం వైపు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొ.కోదండరాం ప్రారంభించిన తెలంగాణ జన సమితికి ప్రజల్లోకి ఇంకా పూర్తిస్థాయిలో వెళ్లకున్నా, అన్ని స్థానాల్లో బలంగా లేకున్నా, కోదండరాంకు మాత్రం ప్రజల్లో మంచి పేరు ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా, సౌమ్యుడిగా, విద్యావంతుడిగా, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. దీంతో మహాకూటమిలోని అందరు నేతల కంటే కూడా కోదండరాం ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా ఉంటారని ఆయన అంచనా వేస్తున్నారు. పైగా, గత ఎన్నికల్లో కేసీఆర్ కి అవకాశమిచ్చామని, ఈ ఎన్నికల్లో కోదండరాంకి ఇద్దామనే భావన కూడా ప్రజల్లో వస్తుందని భావిస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ ఇందుకు ఒప్పుకున్నా కూటమిలో ప్రధాని భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. జనసమితికి కనీసం రెండంకెల సీట్లు కూడా కేటాయించేందుకు ఆసక్తి చూపని కాంగ్రెస్ ఏకంగా ముఖ్యమంత్రి పదవిని వదిలేస్తుందా అనేది ప్రస్తుతానికి మాత్రం పెద్ద ప్రశ్న. అయితే, ‘సీఎం క్యాండిడెట్ గా కోదండరాం’ ఫార్ములా వర్కవుట్ అయ్యే అవకాశం కొంతమేర ఉండటంతో మరి కేసీఆర్ ను ఓడించడానికి కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా సీఎం పదవిని వదులుకుంటుందేమో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*