ఆ రెండింటిపైనే బాబు ఫోకస్

ఆంధ్రప్రదేశ్ లో ‘‘ప్రత్యేక’’ పరిస్థితులు వచ్చాయి. ఏపీలో ప్రత్యేక హోదాకోసం దాదాపు అన్ని పార్టీలూ పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేస్తున్నాయి. టీడీపీ, వైసీపీతో పాటు వామపక్షాలు, జనసేన చివరకు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. కాని విచిత్రమేంటంటే ఏపీలో సాధారణ, మధ్యతరగతి ప్రజల్లో ప్రత్యేక హోదాపై పెద్దగా స్పందన లేదట. ప్రత్యేకహోదా రాదని కూడా వారికి తెలుసు. కేవలం రాజకీయప్రయోజనాల కోసం, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే పోలింగ్ కు ముందు పోరాటాన్ని అందరూ షురూ చేశారన్నది జనం గట్టిగా నమ్ముకుంటున్నారు.

రాజధాని నిర్మాణం…..

అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణమే ఈ ఎన్నికలలో కీలకం కానుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించారు. చంద్రబాబు గత నాలుగేళ్లుగా అమరావతిలో తాత్కాలిక భవనాలను నిర్మించి, శాశ్వత భవనాలకు డిజైన్లను రూపొందిస్తూనే కాలం గడిపేశారు. ఇటీవలే రాజధాని నిర్మాణం డిజైన్లు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు వెనువెంటనే రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించి ఏడు నెలల్లో ఒక ఆకృతి తేవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం ఒక అసెంబ్లీ భవనాన్ని నిర్మించి, పచ్చదనంతో ఆ ప్రాంతాన్ని ఏడు నెలల్లో కంప్లీట్ చేసేలా చూడాలని ఆయన అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఏడునెలల్లో ఆకృతి…..

రాజధాని వచ్చే ఎన్నికల్లో కీలకం కానుంది. గత ఎన్నికల్లో తాను సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తానని మాట ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అయితే నాలుగేళ్లుగా సాధించిందేమీ లేదు. డిజైన్లే నిన్న మొన్నటి వరకూ ఖరారు చేయలేకపోయారు. దీంతో చంద్రబాబు ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లోపు కనీస ఆకృతిని చూపించకుంటే ప్రజలు అస్సలు నమ్మరని గుర్తించిన చంద్రబాబు పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఒక ఆకృతిని ప్రజలకు చూపిస్తే…తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాజధానిని పూర్తిచేయగలరన్న నమ్మకం ప్రజల్లో కల్గించగలుగుతామని చంద్రబాబు భావిస్తున్నారు.

కేంద్రానికి లేఖలు….

రాజధానితో పాటు పోలవరం, ప్రధాన ప్రాజెక్టులను కూడా సత్వరం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2018లోనే నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు గతంలో అనేక సార్లు బహిరంగ సభల్లోనే చెప్పారు. అయితే పోలవరం పూర్తి కావాలంటే కేంద్ర సహకారం అవసరం. అందుకే మరోసారి కేంద్ర మంత్రులు గడ్కరీ, అరుణ్ జైట్లీకి లేఖలు రాయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరానికి సంబంధించిన నిధులను వెంటనే కేంద్రం విడుదల చేసేలా ఘాటుగా లేఖలు రాయాలని అధికారులకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. చంద్రబాబు హోదాపైన కంటే సీరియస్ గా రాజధాని, పోలవరం నిర్మాణాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*