ఏపీ విషయంలో మోడీ సూపర్ ఫాస్ట్ గా…!

కర్ణాటక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించే అవకాశముంది. ఈ మేరకు బీజేపీ నేతలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ విభజన హామీలపై మోడీ ప్రభుత్వం కసరత్తులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సుగమమయిందంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ప్రధాని నరేంద్రమోడీ కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కడప స్టీల్ ఫ్యాక్టరీకి….

ముఖ్యంగా రాయలసీమపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తుంది. కొన్నాళ్ల క్రితం రాయలసీమ డిక్లరేషన్ ను బీజేపీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసమే కడప స్టీల్ ఫ్యాక్టరీకి అన్నీ అనుమతులు ఇచ్చేసి దానిని వీలయినంత త్వరగా శంకుస్థాపన చేయాలన్నది బీజేపీ లక్ష్యంగా కన్పిస్తుంది. అంతేకాకుండా విశాఖ రైల్వే జోన్ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒడిషా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూనే విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ జోన్ ప్రకటన కూడా త్వరలో వచ్చే ఛాన్స్ ఉంది.

పోలవరంపై కూడా….

దీంతో పాటు పోలవరంపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. పోలవరానికి నిధులను కేటాయించడమే కాకుండా ఎప్పటికప్పుడు పురోగతిని కూడా ఆ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీ నుంచి విడిపోయిన తర్వాత మోడీపై, కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీకి భారీగా డ్యామేజ్ జరిగిందని తెలుసుకున్న కేంద్ర నాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగిందంటున్నారు. కేంద్రం ఇప్పటి వరకూ ఎంత మేరకు నిధులు ఇచ్చింది? వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఖర్చే చేసింది? తదితర వివరాలను కూడా ప్రజలముందే ప్రయత్నం బీజేపీ చేయనుంది.

బాబు నిర్ణయంపై…..

కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు పెండింగ్ లో ఉన్న వివిధ ఫైళ్లను సూపర్ ఫాస్ట్ గా పరిష్కరించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విడిచి వెళ్లిపోయారన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. వచ్చే నెలలోనే కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారని బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*