బాబు ఇలా అయిపోయారేంటి …?

బ్యాలన్స్ గా మాట్లాడుతూ ప్రత్యర్థిపై దాడికి పాల్పడటం ఎపి సిఎం చంద్రబాబు స్టయిల్. పరుష పదజాలాన్ని ఆయన ఎక్కువగా వాడిన సందర్భాలు చాలా తక్కువ. మంచి వక్త గా బాబుకి పేరు లేకపోవడంతో ఆచితూచి మాట్లాడతారు ఆయన. అలాగే తనపై ప్రత్యర్ధులు చేసే మాటల దాడిలో దొర్లే తప్పులను మాత్రం చక్కగా ఎండగట్టి అడ్వాంటేజ్ చేసుకోవడంలో బాబు దిట్ట. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అందరిలాగే దిగిపోయారు. తానుకూడా మాటల్లో పదును పెంచాలనుకున్నారో ఏమో కానీ ఆయన పరుష పదజాలం వైపు వెళుతున్నట్లు తాజాగా కర్నూలు లో నిర్వహించిన సభ లో చేసిన ప్రసంగం చెప్పకనే చెప్పింది. ఇటీవల కాలంలో రోజా, విజయసాయి రెడ్డి తమ వ్యాఖ్యల్లో చంద్రబాబు పై ఒకరేంజ్ లో తిట్ల వర్షం కురిపించారు. ఆ ఎఫక్ట్ బాబు పై పడిందో ఏమో కానీ ఆయన తానూ ఏమి తక్కువ తినలేదని నిరూపించేస్తున్నారు.

విపక్షాన్ని పందులతో పోల్చిన బాబు …

వచ్చేవి ఎన్నికలు. మీడియా లో పదేపదే చూపించాలంటే మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత వున్న రోజులు. ఇక నలుగురితో నారాయణ కులంతో గోవిందా అనక తప్పదనుకున్నారేమో చంద్రబాబు విపక్షాన్ని పందులతో పోల్చారు. బురదలో దొర్లే పందులు బయటకు వచ్చి తన తోకతో మిగిలినవారి అందరికి ఆ బురద అంటించి పోతుందని హాట్ హాట్ కామెంట్స్ చేశారు బాబు. వైసిపి నేతలను విమర్శిస్తూ సిఎం ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వైసిపి వి అన్ని లాలూచి రాజకీయాలని, తాను 40 ఏళ్ళుగా నీతిగా నిజాయితీగా వున్నా కాబట్టే ఎవరూ ఇప్పటివరకు టచ్ చేయలేకపోయారంటూ రొటీన్ డైలాగ్స్ ఈ విమర్శలకు కలిపారు.

నేనేం తప్పు చేశాను …?

చంద్రబాబు తన ప్రసంగంలో శైలి మార్చారు. నాలుగేళ్ళు బిజెపితో ఎందుకు అంటకాగారు అని ప్రజల్లో వస్తున్న సందేహాన్ని నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు. నాలుగేళ్ళు మంచి చేస్తారని నమ్మి మోసాపోవడం తప్పా అంటూ ప్రజలనే ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని దేశంలోనే తానే సీనియర్ పొలిటీషియన్ అంటూ పదేపదే చెప్పేస్తున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే విపక్షం ఆయన్ను కార్నర్ చేస్తుంది. తామైతే అనుభవం లేనివారమని ప్రజలు అనుభవం వున్న వారికి ఓట్లేసి గెలిపిస్తే మోసపోయామని ఎలా చెబుతారని విపక్షం ఎదురుదాడికి దిగుతుంది. మోడీ కేసులు పెట్టడం ఖాయమని ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలను చూసి అంచనా కు వచ్చిన బాబు తరచూ ఈ కేసుల అంశాన్ని పదేపదే మాట్లాడుతూ ప్రజలు తన వెంట వుండాలని అంటున్నారు. మోడీ కి ఒక పక్క సవాల్ విసురుతూనే బాబు అభద్రతలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా ? లేక బిజెపి తో మైండ్ గేమ్ లో భాగంగా అంటున్నారో తెలియక జనం అయోమయానికి గురౌతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*