మోడీ దెబ్బకు పీఛే ముడ్…!!

chandrababu-naidu-vs-narendramodi

రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు బాహుబలి కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వాన్ని ఆర్థికంగా చక్రబంధంలో ఇరికించే యత్నాలకు శ్రీకారం చుట్టింది మోడీ సర్కారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. నేషనల్ పొలిటికల్ గేమ్ ప్లాన్ మొదలు పెట్టిన చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలు, కాంగ్రెసు, వామపక్షాలను ఒకే వేదిక మీదకు తెచ్చి మోడీని కట్టడిచేయాలని టీడీపీ అధినేత చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా పరవాలేదు. మోడీ మాత్రం మళ్లీ ప్రధాని కాకూడదనేది చంద్రబాబు యోచన. అందుకుగాను బీజేపీ బలం బాగా క్షీణిస్తే సరిపోతుంది. అందుకనుగుణంగా వివిధ పక్షాలు బలోపేతమై ఒక కూటమిగా ముందుకు వస్తే సైకలాజికల్ ప్రభావం ఉంటుంది. ఓటర్లు ప్రతిపక్షం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీ సైతం భారీగా లబ్ధి పొందుతుందనేది దూరాలోచన. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీస్తున్న పవనాలను ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను రెచ్చగొట్టడమనే ప్రతికూల వ్యూహాన్ని టీడీపీ అధినేత ఎంచుకున్నారు. రచ్చ గెలిచేందుకు ప్రయత్నిస్తున్న బాబుకు సొంత ఇంటిలోనే ఇక్కట్ల పాలు చేయడంపై దృష్టి సారించారు కమలనాథులు. ఎన్నికల తరుణం సమీపిస్తున్న సమయంలో ఫైనాన్షియల్ సంకెళ్లు బిగించేస్తున్నారు. కేంద్రప్రభుత్వానికి ఉండే విశేషాధికారాలు, ఇన్ ఫ్లూయన్స్ ను వినియోగించి ఎటూపాలుపోని సంకటస్థితిని కల్పించబోతున్నారు.

బ్యాంకులకు బంధనాలు…

ఆర్థిక దుస్థితి నుంచి బయటపడటానికి చంద్రబాబు నాయుడు సకల విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ ఇంతవరకూ పూర్తి కాలేదు. అప్పుల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. రైతులకు కొత్తగా అప్పులు పుట్టడం లేదు. మాఫీ అనేది పార్టీకి ప్రయోజనం కలిగించడం లేదు. పైపెచ్చు రైతాంగంలో వ్యతిరేకతకు దారి తీస్తోంది. 50 వేల లోపు రుణాలున్న రైతులు మాత్రమే కొంతమేరకు లబ్ధి పొందగలిగారు. ఆపై బకాయి పడ్డ వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఒకేసారి బ్యాంకులనుంచి ప్రభుత్వమే అప్పు తీసుకుని చెల్లించివేస్తే సరిపోతుందనే యోచనలో ఉంది సర్కారు. ఆరేడు నెలలుగా ఈవిషయంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే ద్రవ్యనిర్వహణ, బడ్జెట్ మేనేజ్ మెంట్ చట్టం దీనికి పెద్ద ఆటంకంగా మారుతోంది. ఏడాదికి ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి ఎనిమిదిలక్షల కోట్లు అంచనా అనుకుంటే 3 శాతం మాత్రమే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. 24 వేలకోట్లకు మించకూడదు. ఈ పరిమితి ప్రభుత్వం ఏనాడో దాటేసింది. కొత్తగా అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత చూపడం లేదు. ఎన్నికల ఏడాది కావడంతో కేంద్రప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకులకు సూచనలిప్పిస్తోంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలను నియంత్రణలో పెట్టడానికి కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు బ్యాంకింగు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏపీ సర్కారు పేరు చెబితే బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి.

పీకల్లోతు రుణాలు…

పూర్తిగా బ్యాంకులనే ఆడిపోసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ విచ్చలవిడిగా నిధులను వినియోగించింది. కళ్లెం లేకుండా ఖర్చులకు పాల్పడింది. ప్రజాకర్షకంగా కొత్త పథకాలు పెట్టి వేల కోట్ల రూపాయలు కుమ్మరించేశారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ అభివ్రుద్ధికి పాటుపడాల్సిన కొత్త రాష్ట్రం తెలంగాణతో పోటీ పడింది. ఉద్యోగుల జీతభత్యాలు మొదలు రుణమాఫీల వరకూ వాస్తవపరిస్థితికి విరుద్ధంగా చేశారు. దీంతో 80 వేల కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రం విడిపోతే తాజా అంచనాల ప్రకారం రెండులక్షల ముప్ఫై వేల కోట్ల రూపాయలకు రుణం చేరుకుంది. నాలుగేళ్లలో మూడు రెట్లు రుణం పెరగడం అసాధారణం. ఇందులో 50 నుంచి అరవై వేల కోట్ల రూపాయలవరకూ దుర్వినియోగం పద్దులో వేసుకోవాలనేది ఆర్థిక వేత్తల అంచనా. చెల్లింపు సామర్థ్యం అంతంతమాత్రంగా ఉన్న ప్రభుత్వం తాహతుకు మించి దొరికిన చోటల్లా అప్పులు దూసి తెచ్చింది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా చెల్లింపులకు నిధులు లేక దివాళా తీయడం ఖాయమంటున్నారు. రుణదాతలు కోర్టులకు వెళ్లి ప్రభుత్వ ఆస్తులను వేలం వేయడమూ తథ్యమని తేల్చేస్తున్నారు. ఈ కారణంతోనే కొత్త అప్పులు పుట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది.

పాతికవేలకోట్ల కష్టాలు…

ప్రభుత్వ అవసరాలంటే రాజకీయావసరాలుగా మారిపోయాయి. 2019 ఎన్నికలను గట్టెక్కాలంటే పాతికవేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయ్యో, రెండువేలో చేతిలో పెట్టి ఓట్లు వేయించుకునేది పాత పద్ధతి. అధికారంలో ఉన్నవాళ్లు ప్రభుత్వ సొమ్ములను పథకాల రూపంలో తక్షణ నగదుగా పంపిణీ చేసి ఓట్లు కొల్లగొట్టడం నేటి రాజనీతి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కానీ చిల్లిగవ్వ ఇచ్చేవాడు కనిపించడం లేదు. చెల్లింపు సంగతి ఎన్నికల తర్వాత చూసుకుందాం. ముందు ఎంత వడ్డీ అయినా సరే రుణం లభిస్తే చాలనే భావనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. దాదాపు పదివేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవసరమవుతాయి. పక్కనే ఉన్న తెలంగాణ అమలు చేసిన తీరులోనే రైతుబంధును ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. అందుకు ఎనిమిదివేల కోట్ల రూపాయల వరకూ అవసరమవుతాయి. మరో ఏడువేల కోట్లరూపాయలు రాజధానిలో నిర్మాణాలు, కొత్తగా ప్రకటించిన పథకాలు, పెంచిన పింఛన్ల మొత్తానికి అవసరమవుతాయని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకుని ప్రజలను అన్నిరకాలుగా సంతృప్తి పరచకపోతే ఎన్నికల సాగరాన్ని ఈదడం కష్టమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకుంటోంది సర్కారు. ప్రజలు సైతం పక్క రాష్ట్రం స్కీములు తమకూ కావాలంటున్నారు. అదే ఇప్పుడు చంద్రబాబుకు ప్రధాన సమస్యగా మారింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*