ఇదీ చంద్రబాబు ఫిలాసఫీ…!

తాను చేస్తే న్యాయం ఇతరులు చేస్తే అన్యాయం…. ఇదీ చంద్రబాబు ఫిలాసఫీ. నాలుగేళ్లుగా కమలం పార్టీతో అతుక్కుబోయి వారి మీద మాట పడనీయని చంద్రబాబు ఇప్పుడు వారి మీద ఎందుకు విమర్శలు చేయడం లేదని నిలదీస్తున్నారు. ముఖ్యంగా తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్, తన ఓటు బ్యాంకు గండికొడతారని భావిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ పై చంద్రబాబు ఎదురుదాడికి దిగుతున్నారు. తాను చెప్పినట్లే నడవాలన్నది చంద్రబాబు అభిమతం. కాని ఇప్పుడు ఎన్నికల సీజన్. ఎవరి మాట ఎవరూ వినరు. ఆ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు.

ఎమ్మెల్యేలను అడ్డంగా లాక్కుని…..

వైసీపీ అధినేత జగన్ తొలి నుంచి టీడీపీ పైన, చంద్రబాబు పైన యుద్ధం సాగిస్తూనే ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని ప్రలోభ పెట్టి చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై జగన్ సహించలేకపోతున్నారు. నీతి, నియమాలు, సిద్ధాంతాలను నిత్యం వల్లెవేసే చంద్రబాబుకు పార్టీ కండువాలు మార్చేటప్పుడు ఆమాత్రం తెలియదా? అని జగన్ చాన్నాళ్ల నుంచి ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రధాన ప్రత్యర్థి టీడీపీ మాత్రమే కాబట్టి ఆయన చంద్రబాబు మాట వినరన్నది అక్షరసత్యం.

పవన్ కు ఎంత మర్యాద…..

ఇక పవన్ కల్యాణ్. నాలుగేళ్లు టీడీపీకి మంచి మిత్రుడిగా మిగిలారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ తనకు బలమైన మిత్రుడని చంద్రబాబూ భావించారు. అందుకే పవన్ ఎక్కడికి వెళితే అక్కడ సమస్యలను వెంటనే పరిష్కరించారు చంద్రబాబు. పవన్ తో మీటింగ్ అంటే ఉత్సాహ పడిపపోయిన చంద్రబాబు ఆయనను కారు వద్ద వరకూ దిగబెట్టేవారు. పార్టీ సీనియర్ నేతలకు ఐదు నిమిషాల సమయం కూడా ఇవ్వని చంద్రబాబు పవన్ వస్తున్నారంటే సమయం గంటలు గంటలు కేటాయించడం చూసి టీడీపీ నేతలే విస్తుపోయేవారు.

ఈ ఎన్నికలు పవన్ టార్గెట్ కాదు….

అలా పవన్ కల్యాణ్ తనకు అండగా ఉంటారని భావించిన చంద్రబాబుకు జనసేనాని ఝలక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో అవినీతిని బహిరంగంగా ఎండగట్టారు. జగన్ కూడా చేయనన్ని విమర్శలు ఒక్క మీటింగ్ తో చేసి పారేశారు. దీంతో చంద్రబాబు కూడా కంగుతిన్నారు. జనం నోట్లో నానుతున్న మాటలనే తన మాటలుగా చేసుకుని జనసేనాని లోకేష్ పై పెద్దయెత్తున అవినీతి ఆరోపణలు చేశారు. జనసేనాని లక్ష్యం 2019 కాదు. ఆ తర్వాత ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ ను చంద్రబాబు పిలిస్తే వస్తారా? అది బాబు అత్యాశే కదూ…. అంతేమరి తాను ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు కన్పించని అన్యాయం, ఇప్పుడు జగన్ అఖిలపక్షానికి రాకపోతే చంద్రబాబుకు కన్పిస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇదండీ ఏపీలో సీన్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*