ఎలక్షన్ స్టంట్స్ వర్కవుట్ అవుతాయా..?

andhra pradesh elections 2019 telugu post telugu news

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ క్రమంగా తారస్థాయికి చేరుకుంటోంది. ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల వరకు పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక, మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కోటి వదిలేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పింఛన్లను రెట్టింపు చేస్తున్న ఎన్నికలకు మూడు నెలల ముందు భారీ నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ఎస్ వ్యూహమే… కాకపోతే ముందే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించడానికి ఆ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రధాన కారణం. అందునా పెద్దసంఖ్యలో ఉన్న పింఛన్ దారులు టీఆర్ఎస్ వైపు నిలిచారనే అంచనాలు ఉన్నాయి. పింఛన్లు రెట్టింపు చేస్తామనే మహాకూటమి హామీతో అప్రమత్తమైన టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు పింఛన్ల రెట్టింపు హామీని తమ మ్యానిఫెస్టోలోనూ చేర్చింది. దీంతో ఇప్పటికే పింఛన్లు టంచన్ గా ఇస్తున్న కేసీఆర్ నే లబ్దిదారులంతా నమ్మారు. ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అయితే, పరిస్థితులు జగన్ కు అనుకూలంగా ఉన్నట్లు వివిధ సర్వేలు చెబుతున్న వేళ ఎన్నికలకు ముందే పింఛన్లు రెట్టింపు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

పింఛన్ల రెట్టింపు… రుణమాఫీ పూర్తి

నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా(పింఛన్ల) పథకం అతిపెద్దది. ఈ పథకం కింద సుమారు 50 లక్షల 61 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతీ నెల సుమారు రూ.550 కోట్లు పింఛన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది. అయితే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వం ఈ పింఛన్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమే. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై భారం రెట్టింపు అవుతుంది. ఇక, ఇదే సమయంలో రైతు రుణమాఫీలో మిగిలిపోయిన నాలుగు, ఐదో విడతలు కూడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. జనవరిలోనే ఇందుకు సంబంధించిన రూ.8 వేల కోట్లను విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇంత డబ్బు సమకూర్చుకోవడం కొంత కష్టంగా మారింది. అయినా, ఎన్నికల వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, ఎన్నికల వేళ తీసుకునే నిర్ణయాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*