చంద్రబాబు టైం బాగాలేదా?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంచేసిన ముహూర్తం బాగాలేనట్లుంది. అన్నిరకాలుగా చంద్రబాబు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రత్యేక హోదా సెంటిమెంట్, మరోవైపు ఎన్డీఏతో తెగదెంపులు, ఇంకొక వైపు సొంత పార్టీలో నేతల కుమ్మలాటలు ఇలా వరుసగా చంద్రబాబును సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవి చాలదన్నట్లుగా గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన వారు సయితం చంద్రబాబుపై కారాలు మిరియాలు నూరుతుండటం విశేషం. అంతేకాదు బాబు పాలనలోని డొల్ల తనాన్ని బయటపెడుతుండటం ఆయన్ను మరింత ఇరకాటంలో పడేస్తుంది.

ఐవైఆర్ కృష్ణారావు ఆరోపణలపై…..

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఆయన రాజధాని భూసేకరణ, డిజైన్ల ఖరారు విషయంలో జరిగిన అవకతవకలను ఏకంగా ఒక పుస్తక రూపంలోనే బయటకు తెచ్చారు. అయితే ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. ఆ పదవి నుంచి తొలగించడంతో తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలాగోలా విమర్శల నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఐవైఆర్ ఒక పార్టీకి కొమ్ముకాసేందుకే తమపైనా, ప్రభుత్వంపైనా బురద జల్లుతున్నారని చంద్రబాబు అండ్ టీం ఎదురుదాడికి దిగింది.

తాజాగా అజయ్ కల్లాం…..

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజయ్ కల్లాం కూడా అలాంటి ఆరోపణలే చేయడం టీడీపీ సర్కార్ మరింత సమస్యల్లోకి వెళ్లిందనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పెరిగిపోయిందన్న అజయ్ కల్లాం సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపిందనే చెప్పాలి. అవినీతిపరుల పాలిటి తాను చండశాసనుడని చెప్పుకునే చంద్రబాబు అజయ్ కల్లాం వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజధాని అంటే పెద్ద నగరాలు నిర్మించడం కాదని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని అజయ్ కల్లాం ఆరోపించారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చేయడాన్ని కూడా అజయ్ కల్లాం తప్పుపట్టారు. కేవలం పైరవీల కోసమే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆయన చేసిన కామెంట్స్ తో టీడీపీ అయోమయంలో పడిందనే చెప్పాలి.

దీనికి అసలు కారణం ఇదేనా?

అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారు పదవీ విరమణ చేసిన తర్వాత ఎందుకు చంద్రబాబుపై దాడికి దిగుతున్నారన్న చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. నిజానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శులెవరికీ ఏపీ ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ లేదన్నది వాస్తవమంటున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు అభ్యంతరం చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ సీఎంవోనే మొత్తం నడిపిస్తుందన్నది ఐఏఎస్ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా సీఎంవో అధికారులు చెప్పినట్లే నడుచుకోవాల్సి ఉంటుంది. అందుకే తాము సర్వీస్ లో ఉన్నా ఏమీ చేయలేక పదవీ విరమణ చేసిన తర్వాత వారు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద మాజీ ఐఏఎస్ లు ఇప్పుడు చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్నారని చెప్పకతప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*