ఆలస్యం అమృతమవుతుందనేనా…??

chandrababunaidu candidates first list

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంక్రాంతి తర్వాత తొలిజాబితాను విడుదల చేస్తామనడంతో ఎందరో తెలుగుతమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. తొలి జాబితాలో తమ పేరు ఉంటుందో? ఉండదో? అన్న టెన్షన్ సీనియర్ నేతల్లోనూ కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అయితే సంక్రాంతి తర్వాత కాదు ఫిబ్రవరిలోనూ తొలి జాబితాను విడుదల చేయడం కష్టమేనంటున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే అభ్యర్థుల తొలి జాబితాను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. సంక్రాంతి పండగకు తొలి జాబితాను విడుదల చేస్తానని ఎవరూ అడగకుండానే చంద్రబాబు చెప్పారు. దీంతో తమ్ముళ్లు చంద్రబాబు ఇలా మారిపోయారేంటి చెప్మా? అంటూ విస్తుపోయారుకూడా.

అభ్యర్థుల ఎంపిక పూర్తయినా….

తాను చెప్పినట్లుగానే చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చాలా రోజుల కిందటే ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలను తెప్పించుకున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తలనుంచి అభ్యర్థిపై అభిప్రాయాలను కూడా సేకరించడం దాదాపుగా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ లోని సుమారు 90 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేశారని పార్టీ ఇంటర్నల్ టాక్. మరి తొలి జాబితాను యాభై మందితో విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం అటువంటి ఆలోచనలో లేరన్నది పార్టీ సీనియర్ నేతల మాట.

వరస కార్యక్రమాలతో…

ప్రస్తుతం ఏపీలో జన్మభూమి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వరుసగా సంక్రాంతి సెలవులు. పండగ తర్వాత చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళుతున్నారు. ఈనెలాఖరులోనూపార్టీ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. అందువల్లనే జనవరి నెలలో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చన్నది టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. జనవరి నెలలోనే కాదు ఫిబ్రవరి నెలలో కూడా కష్టమేనన్నది ఆయన అంచనా. ఫిబ్రవరిలో గుంటూరు-అమరావతి మధ్య ధర్మ పోరాట దీక్ష ముగంపు సభను జరపనున్నారు. ఈ సభను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతీయ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు .అందువల్ల ఫిబ్రవరి నెలలోనూ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం అనుమానమేనంటున్నారు.

వ్యూహాత్మకంగానే…..

ఇప్పటికే అన్ని విధాలుగా సిద్ధమయైన చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం పెద్ద కష్టమేమీ కాదు. తొలి జాబితాలో వివాదాస్పదం లేని స్థానాలను ప్రకటిస్తే ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు. కానీ చంద్రబాబు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చూసిన తర్వాతనే తాను ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను డిసైడ్ చేసిన తర్వాత తలెత్తే అసంతృప్తులను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థిని ప్రకటించాలన్నది బాబు వ్యూహంగా కన్పిస్తోంది. జాబితాను తాను ముందుగా ప్రకటించడం వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువన్న భావనలో ఉన్నారు. అందుకనే వ్యూహాత్మకంగా చంద్రబాబు తొలిజాబితాను ఆలస్యంచేయాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఆలస్యం చేస్తేనే అది తమకు అమృతంగా మారుతుందని చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*