మరోసారి గద్దెనెక్కాలని….??

అమరావతి నుంచే చంద్రబాబు మోదీపై సమర శంఖం పూరించనున్నారు. ఫిబ్రవరిలో జరిగే చివరి ధర్మపోరాట సభకు జాతీయ నేతలందరిని చంద్రబాబునాయుడు ఆహ్వానించనున్నారు. ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనపైనా, తన కుటుంబంపైనా వ్యక్తిగత విమర్శలుచేస్తుండటంతో దానికి దీటైన జవాబు చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం ఫిబ్రవరిలో అమరావతి-గుంటూరుల మధ్య జరిగే ధర్మపోరాట దీక్ష చివరి సభకు జాతీయ నేతలందరినీ ఆహ్వానించి తన పట్టేందో నిరూపించుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలకు ఇక్కడి నుంచే సమరానికి సై అని ప్రకటించనున్నారు నాయుడు.

నేడు ఢిల్లీ టూర్….

అందుకోసమే నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు అందుబాటులో ఉన్న నేతలందరినీ చంద్రబాబు కలవనున్నారు. రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యే అవకాశముంది. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారితో సమావేశంకానున్నారు. ఈరోజు సాయంత్రానికి హస్తినకు చేరుకోనున్నచంద్రబాబు తొలుత పార్టీ పార్లమెంటు సభ్యులతో భేటీకానున్నారు. అగ్రకులాల రిజర్వేషన్లు,జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమిలో పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాన్ని మరోసారి చేస్తున్నారు చంద్రబాబు.

జాతీయ నేతలను కలసి….

ఇప్పటికే గతనెలలో ఒకసారి చంద్రబాబునాయుడు బీజేపీయేతర పార్టీల నేతలందరినీ కలవనున్నారు. రానున్న రోజుల్లో మోదీకి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ ర్యాలీలు నిర్వహించాలి? ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి ఎలా బలంగా తీసుకెళ్లగలగాలి? అన్న అంశాలపై జాతీయ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. దీంతో పాటు ఈ నెల19వ తేదీన పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి అందరూ హాజరై మోదీకి వ్యతిరేకంగా సమైక్యత చాటాలని, తద్వారా కూటమి బలమేంటో దేశ వ్యాప్తంగా తెలియజెప్పాలన్నది చంద్రబాబు ఈ టూర్ ప్రధాన ఉద్దేశం.

రాహుల్ కు ప్రత్యేక ఆహ్వానం….

దీంతో పాటుగా ఫిబ్రవరిలో అమరావతిలో జరిగే ధర్మపోరాట దీక్ష సభను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీని ప్రత్యేక అతిధిగా పిలిచి, ఆయనచేత ప్రత్యేక హోదాపై మరోసారి ప్రకటన చేయించాలన్న తలంపుతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను కూడా ఆయన ఈ సభ ద్వారా ఎండగట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు. రాహుల్ తో పాటు జాతీయ స్థాయినేతలందరినీ పిలిచి తన బలం బలగాన్ని ప్రదర్శించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ టూర్ ఏపీ రాజకీయాల్లనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*