కేసీఆర్ ను ఫాలో అవ్వాలనేనా?

chandrababunaidu follows kchandrasekharrao

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఫాలో అయిన స‌క్సెస్ ఫార్ములానే ఏపీలోనూ చంద్ర‌బాబు పాటించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి విప‌క్షాలు ఏమాత్రం కోలుకోకుండా చేసేందుకు టీడీపీ అధినేత అస్త్రాలు రెడీ చేశారా? గ‌తం కంటే భిన్నంగా అత్యంత కీల‌క‌మైన‌ 2019 ఎన్నిక‌ల‌కు వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు అమ‌లు చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అంతేగాక తెలుగు వారికి అతి పెద్ద పండ‌గ అయిన సంక్రాంతితో.. ఎన్నిక సంగ్రామానికి స‌మ‌ర శంఖం పూరించ‌న‌నున్నార‌నే చ‌ర్చ పార్టీలో మొద‌లైంది. అభ్య‌ర్థుల‌ను ముందుగానే ప్ర‌క‌టిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. ఈ మేర‌కు క‌స‌ర‌త్తు కూడా పూర్తి చేశార‌ని తెలుస్తోంది. అనేక వ‌డ‌పోతల అనంత‌రం.. మొద‌టి జాబితాను ఆయ‌న సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఫార్ములా.. ఇక్క‌డ ఎలా ఫ‌లిస్తుంద‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దేశ రాజకీయాల్లో కీలకంగా….

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా ప‌ట్టుద‌ల‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉన్నారు. ముఖ్యంగా దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని భావిస్తున్న ఆయ‌న‌.. ఈ మేర‌కు ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేస్తున్నారు. త‌న రాజ‌కీయ అనుభ‌వాన్నంతా రంగరించి వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఎప్పుడూ టీడీపీ అభ్య‌ర్థుల జాబితా ఆల‌స్యంగా ప్ర‌క‌టించే చంద్ర‌బాబు.. ఈసారి మాత్రం రూటు మార్చారు. ప్ర‌తిప‌క్షాలు కోలుకునే ఏ ఒక్క అవ‌కాశం ఇవ్వ‌కూడ‌దని యోచిస్తున్నారు. అందుకే కేసీఆర్ ముంద‌స్తు ఫార్ములాను అనుసరించాల‌ని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌.. ముంద‌స్తుగా అభ్య‌ర్థులను ప్ర‌క‌టించి స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే! టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించ‌డంలో అభ్య‌ర్థుల ముంద‌స్తు ప్ర‌క‌ట‌న కూడా కీల‌క పాత్ర పోషించింది. అయితే ఈ స‌క్సెస్ ఫార్ములానే ఏపీలోనూ ఫాలో అవ‌బోతున్నారు చంద్ర‌బాబు.

సిద్ధం చేసినా….

అభ్య‌ర్థుల‌ను ముంద‌స్తుగా ప్ర‌క‌టిస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో ఆయన నేత‌ల‌కు చెప్పారు. దీంతో అభ్య‌ర్థుల్లోనూ ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే తొలి జాబితాను సిద్ధం చేశార‌ని పార్టీ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. దీనిని త్వ‌ర‌లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని చెబుతున్నారు. అయితే ముహూర్తం కూడా ఫిక్స్ చేశార‌ని స‌మాచారం. సంక్రాంతికి ఈ జాబితాను విడుద‌ల చేస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు మూడు నెల‌లకు పైగా స‌మ‌యం ఉంటుంది క‌నుక‌.. అభ్య‌ర్థుల ప్ర‌చారానికి వీలైనంత టైమ్ ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు. దీని వ‌ల్ల టికెట్ ఆశించి అల‌క‌బూనిన నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు కూడా త‌గినంత స‌మ‌యం ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ప్ర‌తిప‌క్షంపై తొలి దెబ్బ ప‌డిన‌ట్టు అవుతుంద‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ఉన్నారు.

ఇబ్బందులు ఉన్నా…..

అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు లేక‌పోలేద‌ని చెబుతున్నారు. పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. త‌మ‌తో పాటు త‌మ కొడుకులు, కోడ‌ళ్లు, బంధువుల‌కు టికెట్ ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌వేళ టికెట్ వీరికి ద‌క్క‌క‌క‌పోతే.. వారు పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే దాఖ‌లాలు లేక‌పోలేదు. దీనిని ముందే ప‌సిగ‌ట్టిన కేసీఆర్‌.. సిట్టింగుల‌కే టికెట్లు కేటాయించేశారు. ఫ‌లితంగా విభేదాలను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించ‌గ‌లిగారు. మ‌రి చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది కీల‌కంగా మారింది. అసంతృప్తులు రెబ‌ల్స్‌గా మార‌కుండా ప్ర‌య‌త్నిస్తే.. కొంత వ‌ర‌కూ వ్యూహం సఫ‌ల‌మ‌య్యే అవ‌కాశం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*