బాబుకు ‘‘లోకల్’’ సెగ…!!

chandrababunaidu local problem

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీనియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడులో టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. త‌మ‌కు ఏ త‌ర‌హా నాయ‌కుడు కావాలో వారు చెబుతున్నారు. తాము ఏం కోరుకుంటున్నామో కూడా వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకు బ‌హిరంగ లేఖ కూడా రాయాల‌ని వారు డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. మాకు ఎక్కడి నుంచో వచ్చిన ఆఫీసర్లు వద్దు.. మా మధ్యన ఉండే నాయకుడే మాకు కావాలి.. మాకు ఎప్పుడూ వెన్నంటి ఉండే వ్యక్తి కావాలి… అలాంటి వారిని మాకు అభ్యర్థిగా నియమించండి. మాకు అభివృద్ధి ముఖ్యం. కులాలు కాదు. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకునే నాధుడు కావాలి!- అంటూ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.

స్థానిక నేతకే…..

ప్ర‌త్తిపాడు నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. అందరినోటా స్థానిక నినాదం వినిపించింది. ఈ విషయాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధ‌మ‌య్యారు. మ‌రి ఇంత‌గా ఎందుకు వారు కోరుతున్నారు? ఏం జ‌రుగుతోంది? అనే కీల‌క విష‌యాల‌నుప‌రిశీలిస్తే.. ప్ర‌ధానంగా గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించి మంత్రిగా కూడా చేసిన ఎస్సీ వ‌ర్గానికి చెందిన రావెల కిశోర్‌బాబు అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించాడు. ఐఆర్ ఎస్ ఉద్యోగాన్ని వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న త‌న వ్య‌వ‌హార శైలితో ఇక్క‌డి టీడీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపించారు. దీంతో ఇక్క‌డి త‌మ్ముళ్లు రావెల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

మళ్లీ ఐఏఎస్ అధికారికి…?

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. ఓడించి తీరుతామ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌తిజ్ఞ చేశారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న త‌నంత‌ట తానుగానే పార్టీ మారిపోయారు. ఇక ఇప్పుడు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో ఐఏఎస్ అధికారిని ఇక్క‌డ నిల‌బెడ‌తార‌ని, చంద్ర‌బాబు ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఇక్క‌డి టీడీపీ శ్రేణులు ఈ ప్ర‌తిపాద‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అధికారులు ఎవ‌రూ కూడా త‌మ‌కు వ‌ద్ద‌ని, వారి ద‌ర్పం ముందు రాజ‌కీయాలు చేయ‌లేమ‌ని, ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నాయ‌కుల‌కు ఎవ‌రికి ఇచ్చినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని చెబుతున్నారు. మ‌రి బాబు ఇక్క‌డి త‌మ్ముళ్ల ప్ర‌తిపాద‌న‌ను వినిపించుకుంటారో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*