ఈ ఇద్దరినీ నమ్ముకున్నారా….??

chandrababunaidu-mamatha-benerjee-key-role

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యంగా పనిచేస్తే ఫలితం ఉంటుందా? అన్ని విపక్షాలు కలసి కట్టుగా సాగుతాయా? డిసెంబరు 10వ తేదీన జరిగే విపక్షాల కూటమి సమావేశానికి ఎవరెవరు? హాజరవుతారు? అందరిలో ఐక్యత కనబడుతుందా? కొరవడుతుందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నెల 10వ తేదీన బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలిపి సమావేశం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలుచేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈపనిలోబిజీగా ఉన్నారు. విపక్షాల్లో ఐక్యగ కన్పించాలంటే ఈ సమావేశం సక్సెస్ అయి తీరాల్సిందే.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు…..

డిసెంబరు 11వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జరగనున్నాయి. ఫలితాలు వెలువడే ఒక రోజు ముందే ఈసమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ అయిదు రాష్ట్రాల ఫలితాలతోసంబంధం లేకుండానే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఐక్యంగా కలసి ముందుకు నడిచేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారి జరిగే ఈ సమావేశంలో తొలుత ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలకు దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ కలిసి ఉద్యమ కార్యాచరణను నిర్వహించనున్నాయి. పెట్రోలు ధరలు, జీఎస్టీ, సీబీఐ దాడులు వంటి అంశాలపై దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలను ఐక్యంగా చేపట్టాలన్నది ఈ సమావేశం ముఖ్యోద్దేశం.

అందరూ హాజరయ్యేలా…?

అయితే ఈ సమావేశానికి అందరూ హజరయ్యేలా చూసేందుకు కాంగ్రెస్ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారు ప్రధానంగా ఉండాలన్నది వీరి ఉద్దేశ్యం. నవీన్ పట్నాయక్ ను సమావేశానికి రప్పించే బాధ్యతను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే మాయావతి, అఖిలేష్ యాదవ్ లను రప్పించే బాధ్యతను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అప్పజెప్పారు.

మమత, బాబులకు అప్పగింత…..

మమత కూడా ఈ సమావేశం సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్ కత్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈసభకు ఇప్పటి నుంచే ఆమె విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపుతున్నారు. తొలుత డిసెంబరు 10వ తేదీ జరిగే సమావేశం సక్సెస్ అయితే ఆ తర్వాత భారీ బహిరంగ సభ ద్వారా అందరూ నేతలు కలసి ఐక్యంగా ఉన్నామని దేశానికి చాటిచెప్పవచ్చన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. మొత్తం మీద డిసెంబరు 10వ తేదీ జరిగే సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, మమత బెనర్జీ మీదే ఎక్కువగా ఆధారపడిందన్నది వాస్తవం. మరి ఈ సమావేశానికి అందరూ హాజరవుతారో? లేదో? చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*