రావెల వెళ్లి..చిక్కుల్లో పడేశారే……!

chandrababunaidu trouble in prathipadu constiuency

రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు ఎవ‌రికి వారు త‌మ త‌మ బ‌లాల‌ను నిరూపించుకునేందుకు రెడీఅ వుతున్నారు. అక్క‌డ ఇక్క‌డ అనే తేడా లేకుండా నాయ‌కులు ప్ర‌తి జిల్లాలోనూ తెర‌మీదికి వ‌స్తున్నారు. టికెట్ల‌ను ఆశిస్తున్నారు. ఇలాంటి వారిలో.. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎస్సీ నియ‌జ‌క‌వ‌ర్గంలోనూ తెర‌మీదికి వ‌చ్చారు. గ‌తంలో రెండు ఎన్నిక‌ల్లో అప‌జ‌యం పాలైన కందుకూరి వీర‌య్య ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే, ఇది రానురాను డిమాండ్‌గా కూడా మారుతుండ‌డంతో ఇక్క‌డ టీడీపీకి ఆయ‌న సెగ పెట్టేలా ఉన్నాడ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

రావెలకు అవకాశమిచ్చి…..

ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప్ర‌త్తిపాడు.. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీగా మారిపోయింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు విజ‌యాలు సాధించిన అప్ప‌టి టీడీపీ ఎమ్మెల్యే మాకినేని పెద‌ర‌త్త‌య్య‌ను ప‌క్క‌న పెట్టి కందుకూరు వీర‌య్య‌కు చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో కందుకూరి విజ‌యానికి చాలా దూరంలో నిలిచారు. కేవ‌లం ఆయ‌న 64 వేల ఓట్లు మాత్ర‌మే సాధించారు. 2012 ఉప ఎన్నిక‌ల్లోనూ వీర‌య్య ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఐఆర్ ఎస్ అధికారి రావెల కిశోర్‌బాబుకు వివిధ రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో చంద్ర‌బాబు అవకాశం క‌ల్పించారు. ఈయ‌న గెలిచి టీడీపీకి మ‌రోసారి ఇక్క‌డ ప‌ట్టం క‌ట్టారు.

ఐఏఎస్ అధికారికి….

అయితే, అధికార ద‌ర్పం, స్వ‌యంకృత అప‌రాధాల‌తో రావెల టీడీపీకి చాలా దూర‌మ‌య్యారు. ఇటీవ‌ల జ‌న‌సేన‌లోకి చేరిపోయారు. దీంతో ఇప్పుడు ఇక్క‌డ టీడీపీకి నేత అవ‌స‌ర‌మ‌య్యారు. అయితే, పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు వేరేగా ఉన్నాయి. ఇక్క‌డ నుంచి ఐఏఎస్ అధికారికి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. ఇటీవ‌ల పార్టీ త‌ర‌ఫున నేత‌లు వ‌చ్చి కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు కూడా సేక‌రించారు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి కందుకూరి పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. రెండుసార్లు పోటీచేసి ఓటమి పాలయినప్పటికీ పార్టీని అంటిపెట్టుకుని కార్యకర్తలకు వెన్ను దన్నుగా ఉంటున్న కందుకూరి వీరయ్యకే ఈసారి టీడీపీ టిక్కెట్టు ఇవ్వాలంటూ పార్టీ నాయకులు కొందరు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.

తనకు తప్ప ఎవరికిచ్చినా….

వీరయ్య మాట్లాడుతూ 2007 నుంచి రత్తయ్య వెంట నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నట్లు చెప్పారు. రెండుసార్లు ఓటమి పాలయినా కార్యకర్తలకు అండగానే ఉన్నానని గుర్తుచేశారు. దీంతో ఆయ‌న పోటీకి రెడీ అవుతున్నార‌నే ప‌రిస్థితి స్ప‌ష్ట‌మైంది. ఈయ‌న‌ను కాద‌ని వేరేవారికి టికెట్ ఇస్తే తాము స‌హ‌క‌రించేది లేద‌ని వీర‌య్య వ‌ర్గం చెపుతోంది. అదే టైంలో ఇదే సీటు నుంచి టీడీపీ త‌ర‌పున ఐఏఎస్ రామాంజ‌నేయులు, మాజీ జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్ కూచిపూడి విజ‌య‌, డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్రసాద్ త‌దిత‌రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*