బాబు టార్గెట్‌తో బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు ఎలాంటి సూచ‌న‌లు చేస్తారో? ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేస్తారో కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌దంతా ఓ విజ‌న్‌తో ముందుకు సాగుతుంటుంది కూడా! ఎప్ప‌టిక‌ప్పుడు వారిని అలెర్ట్ చేయ‌డం, వారి ప‌నితీరుపై స‌ర్వేలు చేయించ‌డం, వారిని మెరుగు ప‌రిచేందుకు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌డం, వ‌ర్క్ షాపులు నిర్వ‌హించ‌డం వంటివి కామ‌న్‌గా జ‌రుగుతున్న‌వే. ఇక, అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేల‌కు వారివారి నియోజ‌క వ‌ర్గాల్లో టార్గెట్లు కూడా విధించ‌డం ప‌రిపాటి. ప్ర‌జ‌లకు సంబంధించిన ప‌నుల‌కు సంబంధించి టార్గెట్లు విధిస్తుండ‌డం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్లు, తాగునీరు వంటి క‌నీస మౌలిక వ‌స‌తుల‌పై చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు టార్గెట్లు విధిస్తూనే ఉన్నారు.

టార్గెట్ ఏంటి?

సిక్కోలు నుంచి సీమ జిల్లాల వ‌ర‌కు కూడా ఈ టార్గెట్లు కామ‌న్‌గానే ఉంటున్నాయి. అయితే, తాజాగా చంద్ర‌బాబు విధించిన టార్గెట్‌తో టీడీపీ నేత‌లు అదిరిపోతున్నారు. తాము ఆ టార్గెట్‌ను రీచ్ అవుతామో లేదో ? అనే విధంగా వారు స‌త‌మ‌త మ‌వుతున్నారు. మ‌రి ఇంత‌కీ ఎమ్మెల్యేలు, నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్న ఆ టార్గెట్ ఏంటి? ఎందుకు ఎమ్మెల్యేలు ఇంత‌గా కుమిలి పోతున్నారు అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తి క‌ర అంశం వెలుగు చూసింది. ప్ర‌స్తుతం టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం నిర్మాణంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు.

పార్టీ భవన నిర్మాణం….

ఈ క్ర‌మంలో దీనిని క‌నీసం 200 ఏళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని, అత్యంత అధునాత‌న టెక్నాల‌జీతో నిర్మిస్తున్నారు. ఎలాంటి వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు, భూకంపాలు వ‌చ్చినా త‌ట్టుకుని చెక్కు చెద‌ర‌కుండా ఉండేలా ఈ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి ఇలాంటి భ‌వ‌నాన్ని నిర్మించాలంటే అంత తేలిక మాటా?! కోట్ల‌కు కోట్లు క‌ర‌గ‌బెట్టాల్సిందే. ఇప్పుడు అదే ప‌ని జ‌రుగు తోంది ఏపీలో. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు దాదాపు ఒక్కొక్క‌రికీ క‌నీస టార్గెట్ విధించిన‌ట్టు స‌మాచారం.

ఒకపక్క ఎన్నికలు……

మ‌న పార్టీ-మ‌న భ‌వ‌నం అనే సెంటిమెంటును రాజేసి.. ప్ర‌తి ఎమ్మెల్యే భారీ మొత్త‌మే చందాగా ఇవ్వాల్సిందేన‌ని ఇప్ప‌టికే చిన‌బాబు, మంత్రి లోకేష్ చెప్ప‌గా.. తాజాగా చంద్ర‌బాబు కూడా ఇదే ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ ప‌రిణామాల‌పై ఎమ్మెల్యేలు తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఒక‌ప‌క్క ఎన్నిక‌లు, మ‌రోప‌క్క ఈ టార్గెట్లు అంటే ఎలా అంటూ.. అనంత‌కు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే మీడియా వ‌ద్ద వాపోయారు. కొంద‌రేమో.. ఈ టార్గెట్ రీచ్ కాకుంటే త‌మ‌ను ఎక్క‌డ నొక్కుతారో ? అన్న టెన్ష‌న్ కొంత‌మందికి ఉంది. మొత్తానికి టీడీపీ కార్యాల‌యానికి నిధులు బాగానే వ‌సూలు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*