కూపీ లాగుతున్నారటగా….??

chief-minister-vs-chief-secratary

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ల మధ్య వార్ కు ఇప్పట్లో తెరపడేట్లు కన్పించడం లేదు. ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలను చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుపడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేయడానికి ఎక్కువ రేట్లకు వడ్డీకి అప్పులు తెచ్చారన్నది ఎల్వీసుబ్రహ్మణ్యం వాదనగా ఉంది. దీనిపై ఆయన సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు. ఇది చంద్రబాబునాయుడికి ఇబ్బందికరంగా మారింది.

విభేదాలు ఈనాటివి కావు…

మొత్తంగా చూసుకుంటే ఎల్వీ సుబ్రహ్మణ్యం, చంద్రబాబునాయుడుల మధ్య విభేదాలు ఈనాటివి కావు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నది ఒక వాదన. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి మంచి అధికారి అని పేరుంది. ఆయనకు కాకుండా ఎల్వీ కంటే జూనియర్ అయిన పునేటాను చీఫ్ సెక్రటరీ పదవిని చంద్రబాబు కట్టబెట్టారని చెబుతారు. దీనిపై ఐఏఎస్ అధికారుల్లో కూడా భిన్నమైన వాదనలు విన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి తన స్వయం నిర్ణయాధికారంతో సీఎస్ ను నియమించుకోవచ్చని కొందరు చెబుతుండగా, సీనియారిటీని ఎలా కాదంటారని మరికొందరు ఐఏఎస్ లు వాదిస్తున్నారు.

పోలింగ్ నాటి నుంచే….

ఎన్నికల సమయంలో పునేటాను తప్పించి చంద్రబాబు అడ్డుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్నే చీఫ్ సెక్రటరీగా ఎన్నికల కమిషన్ నియమించింది. పోలింగ్ రోజు నుంచే ఎల్వీ తన పదవేంటో బాబుకు రుచి చూపారంటున్నారు. డీజీపీ ఠాకూర్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కార్యాలయంలో ఉండి కధను నడిపిస్తున్నారని ఎన్నికల కమిషన్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సీఎస్ ఎల్వీ నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లి నాలుగు గంటల పాటు డీజీపీ ముందే కూర్చోవడం టీడీపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. డీజీపీని ఎవరితో మాట్లాడనివ్వకుండా కట్టడి చేసేందుకే ఎల్వీ ఆయన కార్యాలయానికి వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు తిరిగి…..

ఇక చంద్రబాబు నాయుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద చేసిన కామెంట్లు కాకరేపాయి. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎల్వీ సహనిందితుడని చంద్రబాబు అనడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారట. చంద్రబాబు తిరిగి సీఎం అయితే సీఎస్ పదవి ఊడిపోవడం ఖాయం. ఈవిషయం ఎల్వీకి తెలియంది కాదు. అదే జరిగితే ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈలోపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలను గుర్తించే పనిలో ఎల్వీ ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ కింద 9వేల కోట్లు, అన్నదాతా సుఖీభవ పథకానికి 2,200 కోట్లు, రైతుల రుణమాఫీకి 3,300 కోట్లు ఎలా చెల్లించారని ఆర్థిక శాఖ అధికారులను ప్రశ్నించారట.

అధిక వడ్డీకి ఎందుకు తెచ్చారంటూ…

అంతేకాదు అంత ఎక్కువ వడ్డీకి ఎందుకు అప్పులు తెచ్చారని కూడా ఆర్థిక శాఖ అధికారులను ఎల్వీ సుబ్రహ్మణ్యం నిలదీశారట. కేబినెట్ ఆమోదం పొందిన అప్పులపై కూడా ఎందుకు ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చారని నిలదీయడంతో ఆర్థిక శాఖ అధికారులు నీళ్లునమిలారని చెబుతున్నారు. ఎల్వీ దెబ్బకు ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర సెలవుపై వెళ్లిపోయారని సచివాలయంలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఎల్వీ చేసే రివ్యూల సారాంశాన్ని ఎప్పటికప్పుడు కొందరు చంద్రబాబు వద్దకు చేరవేస్తుండటంతో బాబు సయితం అసహనం వ్యక్తం చేస్తున్నారట. మొత్తం మీద గత ఆరు నెలలుగా తీసుకున్న నిర్ణయాలపై సీఎస్ కూపీ లాగడం టీడీపీ నేతలకు మింగుడుపడటంలేదు. వీరిద్దరి మధ్య వార్ మరి కొన్నాళ్లు కంటిన్యూ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 15990 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*