గోరంట్ల గూటికే చేరాలా …?

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్పకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గం కరువైంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి బొడ్డు భాస్కర రామారావు టిడిపి నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసిపి లోకి బొడ్డు భాస్కరరామారావు జంప్ అయ్యి తన కుమారుడు వెంకటరమణకు రాజమండ్రి ఎంపీ సీటు తెచ్చుకుని పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో కుమారుడి పరాజయంతో తిరిగి సొంత గూటికి చేరిన బొడ్డు భాస్కరరామారావు అప్పటినుంచి పార్టీలో తనపట్టు సాధించడంతో బాటు పెద్దాపురం లో క్యాడర్ ను తనవైపు తిప్పుకున్నారు. దాంతో రాజప్పకు ఇంటిపోరు మొదలైంది.

పెద్దాపురంలో ఇవీ సమస్యలు …

అదీ గాక ఆయన హోం మంత్రిగా రాష్ట్రం మొత్తం తరచూ పర్యటిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే ప్రచారం బాగా సొంత పార్టీ వారే చేస్తూ వచ్చారు. దానికి తోడు రాజప్ప సైతం జిల్లా కేంద్రం కాకినాడ లోనే ఎక్కువ ఉండటం తో ఆయన సీటుకు ఎసరు వచ్చింది. ఈ పరిణామాలను బొడ్డు వర్గీయులు బాగా ఉపయోగించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి రాజప్ప పోటీ చేస్తే ఎదురుగాలి వీచే పరిస్థితి ఉత్పన్నమైంది. దీనికి తోడు ఒక పక్క ముద్రగడ ఉద్యమ అణచివేత పైనా కాపు సామాజికవర్గం ఆగ్రహం గా వుంది. అలాగే జనసేన పార్టీ ప్రభావం పెద్దాపురం నియోజకవర్గంలో అధికంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్త స్థానానికి బదిలీ కావడం ఖాయం అంటున్నాయి టిడిపి వర్గాలు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కొత్తపేట, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రపురం మాత్రమే జనరల్ స్థానాలు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలే టిడిపి నుంచి పోటీ పడుతున్నారు.

ఆయన కన్ను దీనిపై పడింది ….?

దాంతో కొత్త నియోజకవర్గం కోసం వెతుకుతున్న రాజప్పకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కనపడిందంటున్నారు ఆయన వర్గీయులు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత ఎన్నికల్లో పోటీకి దిగి గెలిచారు. బిజెపి కి రాజమండ్రి అసెంబ్లీ సీటు పొత్తులో కేటాయించడంతో బుచ్చయ్య తన రాజకీయ ఓనమాలు దిద్దుకుని ఐదు సార్లు గెలుపు మూడు సార్లు ఓటమి చవి చూసిన అర్బన్ కి గుడ్ బై కొట్టారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా వుండే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన, బిజెపి పొత్తు టిడిపి గాలి తోడు కావడంతో ఘన విజయం సాధించారు గోరంట్ల. అయితే ఇప్పుడు రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాపు సామాజికవర్గం లేదా బిసి సామాజికవర్గానికి చెందిన చరిష్మా వున్న నాయకుడు రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపే యోచనను పసుపు పార్టీ చేస్తుందంటున్నారు.

అదే సురక్షితమని ….

ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ తనకు అత్యంత సురక్షితమని భావించి రాజప్ప ఇక్కడినుంచి రింగ్ లోకి దిగేందుకు అధిష్టానం ముందు తన మనోగతం వెల్లడించినట్లు తెలియవస్తుంది. మరోపక్క ఇప్పటికే గోరంట్ల తన సంప్రదాయ స్థానం రాజమండ్రి అర్బన్ నుంచి 9 వ సారి టికెట్ సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. అయితే ఇక్కడినుంచి సీటు ఆశిస్తున్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నుంచి గుడా చైర్మన్ గన్ని కృష్ణ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురుకానుంది. రూరల్ నుంచి గోరంట్ల తప్పుకోవడం ఖాయమైన నేపథ్యంలో రాజప్ప తెలివిగా ముందే దానిపై ఖర్చిఫ్ వేసి అధిష్టానం ఆదేశాల కోసం చూస్తున్నారు అన్నది టాక్.

బాబు ఏం చేయనున్నారు ..?

చంద్రబాబుకు వీరవిధేయుడిగా, నమ్మకస్తుడిగా వున్న రాజప్పకు ఆశించిన దానికన్నా అధినేత ఎక్కువే చేశారు. ప్రజారాజ్యం పార్టీ రాకతో తూర్పులో కాపు సామాజికవర్గం నేతలంతా క్యూ కట్టినా రాజప్ప చంద్రబాబు పై అచంచల విశ్వాసంతో సొంత పార్టీలో ఉండిపోయారు. బాబు కు ఆ విధేయత నచ్చే ఆయనకు పార్టీ అధికారంలోకి రాగానే ఉపముఖ్యమంత్రి తో బాటు హోం మంత్రి బాధ్యతలు అప్పగించి రుణం తీర్చేసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అందుకున్న రాజప్ప కు రాబోయే ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. సిట్టింగ్ స్థానం వదులుకుని కొత్త నియోజకవర్గానికి ఆయన మారాలిసివుంటుంది. అయితే రాజమండ్రి రూరల్ లో కొత్త అభ్యర్థిగా ఆయన ఉండటం ఒకరకంగా ప్లస్ కొన్ని మైనస్ లు ఉన్నాయంటున్నారు. కానీ గతంలో అనేక వివాదాల నేపథ్యంలో పెద్దాపురంలో గెలిచి నిలిచిన రాజప్పకు రూరల్ లో పోటీ పెద్ద సమస్య కాబోదన్న చర్చ నడుస్తుంది. మరి తెలుగుదేశాధినేత తన నమ్మిన బంటును ఏం చేస్తారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*