చింత‌మ‌నేనీ.. ఇంక మార‌వా… !

రాష్ట్రంలో అత్యంత వివాదాస్ప‌ద‌ ఎమ్మెల్యే ఎవ‌రని ఎల్‌కేజీ స్టూడెంట్‌ను అడిగినా.. వెంట‌నే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు వైపు వేలు చూపించేస్తున్నాడు. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాల‌తో మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఉన్న ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ అంత వివాదాస్ప‌ద ఎమ్మెల్యేగా చ‌రిత్ర సృష్టించారు. దీనిపై ఎంత మంది విమ‌ర్శిస్తున్నా.. స్థానికంగా ప్రజ‌లు దుమ్మెత్తి పోస్తున్నా కూడా ఆయ‌న మార‌డం లేదు. సాక్షాత్తూ పార్టీఅధినేత‌, సీఎం చంద్ర‌బాబు సైతం నువ్వు మారాలి. అని నిష్క‌ర్ష‌గా చెబుతున్నాకూడా ఆయ‌న మార‌డంలేదు. పైగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ త‌న ఓట‌మి ఖాయ‌మ‌ని అనుకుంటున్నాడో ఏమో.. ఆయ‌న మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు.

ఎవరి మాటా వినకుండా…..

ప్ర‌తి విష‌యంలోనూ నోరేసుకుని ప‌డిపోవ‌డం, చేయి చేసుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. గ‌తంలో త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిని కొట్టించిన చింత‌మ‌నేని త‌ర్వాత ఆర్టీసీ డ్రైవ‌ర్‌, కండెక్ట‌ర్‌పైనా దాడి చేశాడు. ఆ త‌ర్వాత బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అడుసు తొక్క‌నేల కాలు క‌డ‌గ నేల ! అని చెప్పినా ఆయ‌న ఎవ‌రి మాటా వినిపించుకోవ‌డం లేదు. తాజాగా మ‌ళ్లీ ఇదే రీతిలో అధికారుల‌పై ఉవ్వెత్తున ఎగిసి ప‌డ్డాడు. కార్మిక శాఖ అధికారుల తీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిందులు తొక్కాడు. కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

అధికారులపై ఆగ్రహం…..

దెందులూరు నియోజక వర్గంలో 15 వేల మంది అసంఘటిత కార్మికులను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం సభ్యత్వం నమోదు చేయించామని, వారికి ఈ రోజు వరకూ ఎలాంటి ప్రయోజనాలు అందించలేదని చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక శాఖ అధికారుల తీరే అందుకు కారణమని ఆరోపించారు.అయితే, దీనిపై అధికారులు గ‌ణాంక స‌హితంగా కొన్ని వివ‌రాల‌ను ఎమ్మెల్యే ముందు పెట్టారు. అయితే, వీటిని తోసిపారేసిన ఎమ్మెల్యే.. అధికారుల చేత‌కాని త‌నం ఇదే అంటూ నోరేసుకుని ప‌డ్డారు.

ఎంత సర్ది చెప్పినా…..

భవన నిర్మాణ సంక్షేమ పథకం కింద నమోదు చేసుకున్న వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులే ఉన్నారని, వారిలో ఎవరికీ 90 రోజుల భవన నిర్మాణ పనిదినాలు లేవని కార్మిక జాయింట్‌ కమిషనర్‌ రామారావు చెప్పడంతో చింతమనేని మ‌రింత‌గా నిప్పులుచెరిగాడు. దీంతో కార్మిక శాఖ అధికారి రామారావు, చింతమనేని మధ్య వాగ్వాదం జరిగింది. ఏ ప్రాతిపదికపై పనిదినాలు గుర్తిస్తారో చెప్పాలని ఆయన నిలదీశారు. మొత్తానికి మ‌ళ్లీ .. తీవ్ర వివాదాన్ని సృష్టించ‌బోయిన చింత‌మ‌నేనిపై స్థానికంగా ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి నాయ‌కుడు ఎప్పుడు మార‌తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*