చింతమనేనిని వదిలేలా లేరుగా …?

నడిరోడ్డుపై ఒక మహిళను జుట్టు పట్టుకుని కొట్టారు. ఆమె సాధారణ మహిళ కూడా కాదు. తహశిల్దారుగా పనిచేస్తూ ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి . ఇక ఆమెపై చేయి చేసుకున్న ఆయన చిన్నోడేమి కాదు. సాక్షాత్తు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి. ఇసుక దందాల నేపథ్యంలో సాగిన ఈ వివాదం జరిగి చాలా కాలమే అయ్యింది. అది జరిగి సోషల్ మీడియా లో వైరల్ గా మారి టిడిపి పరువు రోడ్డెక్కింది. అంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకోబోయే చర్యల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ సిత్రం ఈ సంఘటన జరిగి ఇప్పటికి ఏమి కాలేదు. పైగా సిఎం స్వయంగా పంచాయితీ పెట్టి రాజీ చేశారు. ఇలాంటి కేసులే ఇప్పుడు జనసేనాని పవన్ కి అస్త్రాలుగా అధికార పార్టీపై ఎక్కుపెట్టడానికి పనికొస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చింతమనేని ప్రభాకర్ గుండాయిజం పై మాటలు తూటాల్లా వదులుతున్నారు పవన్.

సమాజానికి ఏం మెసేజ్ పోతుంది …?

ఒక అధికారిపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు లేకపోతే సామాన్య జనానికి ఎలాంటి రక్షణ చట్టాలు కల్పిస్తాయని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీనిద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ పోతుందని నిలదీశారు. ప్రభుత్వ పనితీరు ఇలావుంటే మహిళలకు, చిన్నారులకు రక్షణ ఎక్కడిదన్నారు. ఒక అమ్మాయిపై అత్యాచారం చేసినా అడిగే దిక్కే ఉండదు అనే ధైర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని దుమ్మెత్తి పోశారు.

ఎమ్మెల్యేను శిక్షించి ఉంటే……

ఆ ఎమ్యెల్యే ను తీసుకెళ్లి శిక్షించి ఉంటే వేరేగా ఉండేదని కానీ అలాంటి వారికీ కొమ్ము కాసి వ్యవస్థను ఎక్కడికి తీసుకు వెళుతున్నారంటూ ప్రశ్నించారు పవన్. వీటిపై ఏ ఒక్కరు మాట్లాడటం లేదని బాధ్యత గల తనలాంటివారు మాట్లాడకపోతే భావితరం ఎలా ఉంటుందో వూహించలేమన్నారు. ఇప్పటికే పవన్ పశ్చిమ పర్యటనలో దెందులూరు ఎమ్యెల్యే బాగోతంపై ప్రతి సభలో చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా చింతమనేని పాత కేసు ప్రజలకు వివరిస్తూ అధికార పార్టీ లో కొందరు సాగిస్తున్న గూండాయిజాన్ని పీకే నిలదీస్తుండటం చర్చనీయాంశం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*