సీకే బాబు టాక్టీస్ చూశారా….?

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పరిస్థితి ఏంటి..? ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారు? సీకే బాబు ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్లా? లేనట్లా? అవును సీకే బాబు నిజంగా భారతీయ జనతా పార్టీలో లేనట్లే. ఆయన సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీలుంటే కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీకి సిద్ధమవుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. చిత్తూరు నియోజకవర్గంలో సీకేబాబుకు సొంత ఓటు బ్యాంకు ఉందనండంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన మొన్నటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బెంగళూరు వెళ్లి మరీ కొన్నాళ్ల క్రితం అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు.

నాలుగు సార్లు గెలిచి……

సీకే బాబు చిత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచారు. ఒక రకంగా చెప్పాలంటే సీకే బాబు అంటే చిత్తూరు అనేలా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీకే బాబును దగ్గరకు తీసిన తర్వాత ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతులను సీకే బాబు చిత్తూరులో నిర్వహిస్తూనే ఉంటారు. అలాంటిది ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకుండా జంగాలపల్లి శ్రీనివాస్ కు టిక్కెట్ ఇస్తారని భావించి సీకేబాబు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో జంగాలపల్లి గెలుపునకు సీకే బాబు కృషి చేసినా గెలవలేదు. అయినా ఆయన వైసీపీలోనే కొన్నాళ్లు కొనసాగారు. అయితే చివరకు వేరే మార్గంలేక కమలం పార్టీ కండువా కప్పుకున్నారు.

బీజేపీ పరిస్థితి బాగాలేకపోవడంతో…..

కాని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దీంతో ఆయన బీజేపీకి దూరమవుతున్నారు. ఆయన పార్టీ జెండా లేకుండా సొంతంగానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించుకున్న సీకే బాబు దానిపైన అంబేద్కర్, వైఎస్. రాజశేఖర్ రెడ్డి, ఎంజీఆర్ వంటి నేతల ఫొటోలను ముద్రించడం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ తనను ఎంతగానో ప్రేమించేవారని ప్రతి సభలో సీకే బాబు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు సీకే బాబు అంబేద్కర్ ఫొటోను ముద్రించారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలోనితమిళ ఓటర్లను ఆకర్షించేందుకు ఎంజీఆర్ బొమ్మను ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ నుంచి……

వచ్చే ఎన్నికల్లో సీకే బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారమూ జరుగుతోంది. కాంగ్రెస్ కు ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. హస్తం గుర్తు ప్రజల్లో బలంగా ఉండటంతో తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా సీకేబాబు రాకకు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవచ్చు. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన బాబు తర్వాత మనసు మార్చుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*