కాంగ్రెస్ కు ముందున్నవన్నీ మంచిరోజులేనా?

తెలంగాణ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా టీ పీసీసీచీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పిన‌ట్లుగానే కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. బుధ‌వారం కూడా ప‌లువురు నేత‌లు రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో చేరుతున్నారు. ఇందులో ప్రజాగాయ‌కుడు గ‌ద్దర్ త‌న‌యుడు జీవీ సూర్యకిర‌ణ్‌ కూడా ఉన్నారు.. సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌న్న స‌మాచారంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అదేవిధంగా ఆయ‌న‌తోపాటు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు నాగం జ‌నార్దన్‌రెడ్డి, క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయ‌కుడు ఆది శ్రీ‌నివాస్ కూడా రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు.

నాగం చేరిక నేడే…..

నాగం తెలంగాణ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌. ఆయ‌న టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పేసి తెలంగాణ న‌గారా స‌మితి పార్టీ స్థాపించి ఆ పార్టీ త‌ర‌పున కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన ఆయ‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆది శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ వ‌యా వైసీపీ బీజేపీ ఇలా ప‌లు పార్టీలు మారి చివ‌ర‌కు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక వీరి సంగ‌తి ఇలా ఉంటే విప్లవోద్య‌మంలో కీల‌క పాత్ర పోషించి, త‌న పాట‌ల‌తో ప్రజ‌ల్లో విప్లవ చైత‌న్యం తీసుకొచ్చిన ప్రజాయుద్ధ నౌక గ‌ద్దర్ కుమారుడు జీవీ సూర్యకిర‌ణ్‌ కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తుండ‌డం అంద‌రినీ ఆశ్చర్యంలోకి నెడుతోంది.

గద్దర్ కొడుకు కాంగ్రెస్ లోకి….

ఇంత‌వ‌ర‌కూ గ‌ద్దర్ కుమారుడు సూర్య గురించి పెద్దగా జ‌నానికి తెలిసింది లేదు. ఆయ‌న ఏం చేస్తారు..? ఎక్కడ ఉంటారు..? ప‌్రత్యక్ష రాజ‌కీయాల‌తో సంబంధాలు ఉన్నాయా లేవా..? అన్న విష‌యాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి కొద్ది రోజులుగా గ‌ద్దర్ కుటుంబం నుంచి ఒక‌రు పార్లమెంట‌రీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌నే టాక్ వినిస్తోంది. తాజాగా జీవీ సూర్యకిర‌ణ్ పేరు బ‌య‌ట‌కు రావ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. జీవీ సూర్య కిర‌ణ్ హైద‌రాబాద్‌లోని నిఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు స‌మాచారం. ఆయ‌న‌కు ప‌రోక్షంగా పార్లమెంట‌రీ రాజ‌కీయాల‌తో సంబంధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎక్కడి నుంచి పోటీ?

గ‌తంలో హైద‌రాబాద్‌లో ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గెలుపులో, బీజేపీ ఎమ్మెల్సీ గెలుపులో ఆయ‌న కీల‌కంగా ఉన్నట్లు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత జీవీ సూర్యకిర‌ణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కడి నుంచి బ‌రిలోకి దిగుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా పెద్దప‌ల్లి పార్లమెంట్ స్థానం నుంచి లేదా వ‌రంగ‌ల్ పార్లమెంట్ స్థానం నుంచి బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.