రేవంత్ కు ఆ పదవి ఎందుకు ఇవ్వలేదంటే..?

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. మొత్తం తొమ్మిది జెంబో కమిటీలను నియమించింది. ఇంచుమించు అందరు సీనియర్ నేతలకూ ఈ కమిటీల్లో పార్టీ అవకాశం కల్పించింది. టీపీసీసీకి ఇద్దరు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 15 మందితో కోర్ కమిటీ, 53 మందితో ఎన్నికల కమిటీ, 41 మందితో కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ కమిటీల కూర్పు కాంగ్రెస్ లో కొత్త కలహాలకు దారి తీసేలా కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి హ్యాపీనేనా..?

అనేక రోజులుగా పదవులపై గంపెడాశలు పెట్టుకున్న కొందరు నేతలకు పార్టీ నియమించిన కమిటీల్లో ఆశించిన పదవులు దక్కలేదని అసంతృప్తిగా ఉంటే, మరికొందరు నేతలు మాత్రం ఇతర నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పెదవి విరుస్తున్నట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో కొత్తగా చేరిన కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల కొందరు సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కొత్తగా వచ్చిన ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇవ్వడం సరికాదని వారు అంటున్నారు. ఇదే సమయంలో తనకు దక్కిన పదవిపై రేవంత్ రెడ్డి కూడా అంతగా సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఆశించారు. ఈ పదవి ఇస్తే రాష్ట్రమంతా తిరిగి పార్టీని గెలిపిస్తానని ఆయన అధిష్ఠానానికి విన్నవించారు. అయితే, ప్రచార కమిటీ పదవి రేవంత్ కి ఇస్తే వన్ మెన్ షో అవుతుందని సీనియర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆయనకు ఆ పదవి దక్కలేదు.

అసంతృప్తిలో సీనియర్ నేతలు…

ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని ఆశించిన మాజీ ఎంపీ, సీనియర్ నేత వి.హనుమంతరావుకు కూడా ఆశించిన పదవి దక్కలేదు. రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయాలని ఆయన కూడా ఆశించారు. కానీ ఆయనను వ్యూహ రచన కమిటీ ఛైర్మన్ గా నియమించి గాంధీ భవన్ కే పరిమితం చేసింది పార్టీ. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా కమిటీల కూర్పు పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇక పీసీసీ పదవి ఆశించిన ఎమ్మెల్యేల డీకే అరుణను ప్రచార కమిటీ డిప్యూటీ ఛైర్ పర్సన్ గా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మేనిఫెస్టో కమిటీ డిప్యూటీ ఛైర్మన్ గా నియమించారు. వీరికి కూడా ఆశించిన పదవులు దక్కినట్లు కనపడటం లేదు. ఇక జానారెడ్డి, జీవన్ రెడ్డి వంటి ముఖ్యనేతలకు కూడా కీలక పదవులు ఏవీ కట్టబెట్టలేదు. మొత్తానికి చూస్తే ఎవరినీ హర్ట్ చేయకుండా అధిష్ఠానం జెంబో కమిటీలు వేసినా కొంతమంది నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. వీరిని బుజ్జిగించి ఎన్నికల వేళ యాక్టీవ్ గా మారిస్తేనే కాంగ్రెస్ కు మేలు జరిగే అవకావం ఉంటుంది. లేకపోతే కొత్త కమిటీలు కాంగ్రెస్ కు బూమరాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*