కేసీఆర్ స్కెచ్ తో కాంగ్రెస్ అలర్ట్..!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనపడుతున్నాయి. టీఆర్ఎస్ నేతల మాటలు, కేసీఆర్ ఢిల్లీ పర్యటన, ప్రగతి నివేదన సభ వంటి రాజకీయ పరిణామాలు ముందస్తు ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయి. మళ్లీ టీఆర్ఎస్ దే విజయమని ధీమాగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం, సమయం ఇవ్వకుండా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా, కంటివెలుగు వంటి భారీ పథకాలను ప్రవేశపెట్టి ఎక్కువ జనాభాకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించిన ఆయన మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అవి కూడా సాధ్యమైనంత త్వరగా ప్రకటించి అసెంబ్లీని రద్దు చేసే సూచనలు కనపడుతున్నాయి. అడ్డంకులు అన్నీ తొలిగితే డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం కనపడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా వేస్తున్న అడుగులతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయ్యింది. ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు అత్యవసర సమావేశాలను ఏర్పాటుచేసుకుంది.

పైకి ధీమాగా కనపడుతున్నా..

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము 100 స్థానాలు గెలుస్తామని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా ధీమాగా చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు, క్యాడర్ ఉండటం, బలమైన నాయకులు ఉండటం, పొత్తులతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేయడం లేదు. ఎంత ధీమాగా ఉన్నా ప్రత్యర్థికి కొంచెం కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది కేసీఆర్ ప్లాన్. అందుకే ఇంతవరకూ సిట్టింగ్ లు అందరికీ టిక్కెట్లు ఇస్తామన్న ఆయన ఇప్పుడు కుదరదు అంటున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వమని మొన్నటి పార్టీ సమావేశంలో తేల్చారు. ఇక సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభను విజయవంతం చేయడం ద్వారా ప్రజలు తమవైపే ఉన్నారనే ఒక ఇమేజ్ ను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇక మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఆలోచన కూడా చేస్తున్నట్లు కనపడుతోంది. కాంగ్రెస్ ను నైతికంగా దెబ్బతీసేందుకు ఆ పార్టీ నుంచి కొంతమంది అసంతృప్త నేతలను చేర్చుకోవాలని భావిస్తున్నారు.

టీఆర్ఎస్ వైఫల్యాలే ఆయుధాలుగా..!

కేసీఆర్ వేగంగా వేస్తున్న అడుగులతో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయ్యింది. ఆ పార్టీ నేతలు గాంధీ భవన్ లో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనే తమ ఆయుధాలుగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని గ్రామగ్రామానికీ తీసుకెళ్లాలని భావిస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీలైన రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రూ. రెండు వేల వృద్ధాప్య, వితంతు పింఛన్లు వంటి హామీ లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రతీ గ్రామంలో టీఆర్ఎస్ నెరవేర్చని హామీలు, వైఫల్యాలతో ఒక ఫ్లెక్సీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ మండలంలో సుమారు ఐదు వేల మంది ప్రజలతో సభ ఏర్పాటు చేసి కూడా ఈ విషయాలను తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు ధీటుగా ప్రజల ఆవేదన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా ఆలోచిస్తోంది.

సెప్టెంబర్ లోనే అభ్యర్థుల ఎంపిక

ఓ వైపు సెప్టెంబర్ మొదటి వారంలోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కేసీఆర్ చెప్పడంతో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ చివరి వారంలోగా కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రతీ జిల్లాకు ఇద్దరు ఇంఛార్జిలను నియమించనున్నారు. వీరు ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహుల వివరాలు సేకరించి రాష్ట్ర స్థాయి టిక్కెట్ల ఎంపిక కమిటీకి సమర్పిస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీ ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ఆశావాహుల పేర్లను అధిష్ఠానానికి పంపిస్తారు. సెప్టెంబర్ చివరి నాటికి అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనుంది. ఈ మేరకు పీసీసీ ఇప్పటికే ఏఐసీసీకి కూడా సమాచారం అందించింది.