నేరచరితులకు గడ్డు కాలమే …??

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే పేరొందింది. అయితే ఎన్నికల్లో నేరచరితుల హల్చల్ కారణంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చలు పడుతున్నాయి. మచ్చలు అనే కన్నా ఒక్కో సందర్భంలో తీవ్ర అపహాస్యం పాలు అవుతుంది. దీనికి ప్రధాన కారణం చట్టాల్లో వున్న లోపాలు పార్టీలకు చుట్టలుగా మారుతున్నాయి. ఫలితంగా నేరచరితులే చట్టసభల్లో అత్యధికశాతం ఎన్నికయి కొత్త చట్టాలు చేసేస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారంగా పూర్తిగా మార్చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్య వాదులంతా ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించారు. బూజు పట్టిన చట్టాలను సవరించాలని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలతో ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలవాలని కోరుతున్నారు. భారత ప్రజాస్వామ్యంలో నేరచరితులు, ధనవంతులే ఎన్నికలను శాసిస్తున్నారు. ఫలితంగా స్వతంత్ర ఫలాలకోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారి త్యాగాలకు అర్ధమే లేకుండా పోతుంది. బ్రిటిష్ పాలనే నయం అనే స్థాయికి పాలకుల అవినీతి ఆశ్రిత పక్షపాతాలు పెచ్చుమీరిపోయాయి.

ప్రజాసంఘాల పోరాట ఫలితంగా …

పునాదులు కదిలిపోతున్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ఒక పక్క సుప్రీం కోర్టు మరో పక్క కేంద్ర ఎన్నికల సంఘం క్రమ క్రమంగా నడుం కట్టడం శుభపరిణామం. నేరచరితులను వీలైనంతగా చట్టసభల్లోకి రాకుండా అడ్డుకునే అన్ని మార్గాలను సుప్రీం కోర్టు అన్వేషిస్తుంది. ఇంకో పక్క ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య వాదుల వత్తిడికి తలొగ్గి నిబంధనలు కఠినతరం చేస్తూ వస్తుంది. తాజాగా ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థులు తమపై వున్న కేసుల వివరాలను మూడు సార్లు బహిరంగ పరచాలనే నిబంధన తెచ్చింది. దాంతో బాటు అఫిడవిట్ లో ఖచ్చితంగా అన్ని కేసులు పొందుపరచాలని ఆదేశించింది.

దాటవేస్తే అనర్హత వేటే….

అఫిడవిట్ లో పొందుపరచకుండా కేసులు దాటవేస్తే అభ్యర్థి పై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. చాలా మంది అభ్యర్థులు తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. వీరిపై ఇకపై నిఘా ఉంచనున్నారు. వెబ్ సైట్ లో అభ్యర్థుల జాతకాలు అన్ని పొందుపరుస్తారు. ఇది కొంతమేరకు ప్రజలకు ప్రయోజనం చేకూరే అంశమే. ప్రత్యర్ధులు వీటిని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల పార్టీలు సైతం టికెట్లు ఇచ్చేటప్పుడు ఆచితూచి అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశాలు వున్నాయి. ప్రజా పోరాటాలు సందర్భంగా బనాయించే కేసులు మినహాయిస్తే హత్యలు, మానభంగాలు చేసేవారు కూడా చట్టసభల సభ్యులుగా ఎన్నిక అవుతూ వున్న అవకాశాలను ఎంతో కొంత అరికట్టే పరిస్థితి రాబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*