డోలాయమానంలో డీఎస్….?

సీనియర్ నేత డి.శ్రీనివాస్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? టీఆర్ఎస్ లో కొనసాగాలా? వీడి కాంగ్రెస్ లో చేరిపోవాలా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఆహ్వానం అందింది. ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇవీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన అనుచరులు, సన్నిహితులతో చర్చ సందర్భంగా తలెత్తిన ప్రశ్నలు. డి.శ్రీనివాస్ తన అనుచరులు, సన్నిహితులతో కలసి రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.

అనుచరులతో సమావేశం…..

గత పదిహేను రోజుల నుంచి డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ఆయన నుంచి ఎటువంటి కబురు రాలేదు. మరోవైపు జిల్లాలోని తన అనుచరుల నుంచి డి.ఎస్ కు తీవ్ర వత్తిడి వస్తుంది. టీఆర్ఎస్ లో ఉండి లాభం లేదని, తాడో పేడో తేల్చుకుని బయటకు వచ్చేయాలని అనుచరులు గట్టిగా డీఎస్ పై ప్రెషర్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ముఖ్య అనుచరులతో జరిపిన సమావేశంలో కూడా ఎటూ తేల్చుకోలేకపోయారు. ముఖ్యమంత్రి తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని డీఎస్ ఈ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది.

పదిహేను రోజుల నుంచి…..

డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు డీఎస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడికి పంపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగి పదిహేను రోజులవుతున్నా కేసీఆర్ నుంచి ఎటువంటి కబురు లేదు. డీఎస్ మాత్రం తనకు రాజ్యసభ పదవి ఇచ్చిన కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకోవాలని భావించారు.అయితే కొన్ని రోజులుగా సీఎం అపాయింట్ మెంట్ కోసం డీఎస్ ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు.

కాంగ్రెస్ లో చేరిక ఖాయమే…..

దీంతో డీఎస్ దాదాపుగా కాంగ్రెస్ లో చేరాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే డీఎస్ కు ఆహ్వానం అందింది. ఢిల్లీ నుంచి ఏఐసీసీ నేత ఒకరు ఫోన్ చేసి డీఎస్ ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, ముఖ్యమైన పదవిని ఇస్తామని ఆయనకు చెప్పినట్లు తెలిసింది. అయితే కేసీఆర్ తో మాట్లాడి నిజామాబాద్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించిన తర్వాతే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద డీఎస్ పది రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*