డీఎస్‌ ‘‘సన్’’ స్ట్రోక్ కు ఇదే కారణమా?

టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు డి. శ్రీ‌నివాస్ పార్టీ మారిపోతారనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు `సన్‌`స్ట్రోక్ త‌గిలింది. ఇప్ప‌టికే పార్టీ నేత‌లంద‌రూ ఆయ‌న ఎక్క‌డ దొరుకుతారా అని తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. కొడుకుపై కేసులో సూపర్ ట్విస్ట్ వీరికి ఆయుధంగా దొరికింది. దీంతో ఇన్నాళ్లూ ఆయ‌న్ను ఎలా ఎదుర్కోవాలో తెలియని నేత‌లు ఇప్పుడు ఆయ‌న కొడుకు వైపు నుంచి విమ‌ర్శ‌ల దాడి చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో అస‌మ్మతిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయ‌న‌కు మ‌రో ఉప‌ద్ర‌వం ఎదురైంది. ఆయ‌న త‌న‌యుడిపై నిర్బ‌య కేసు న‌మోదు కావడం ఇప్పుడు గులాబీ పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై గట్టిగా మాట్లాడలేక ఇరుకున ప‌డిపోయార‌ని పార్టీ నాయ‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఆయ‌నకు పొమ్మ‌న‌కుండానే పొగ పెడుతున్నారా అనే ప్ర‌శ్న బ‌లంగా వినిపిస్తోంది.

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ….

నిజామాబాద్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీనియర్ నేత డి.శ్రీనివాస్‌పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ నిజామాబాద్‌ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత ఇటీవలే డిమాండ్‌ చేశారు. ఇప్పుడు, ఆయన తనయుడు సంజయ్‌పై పోలీసు కేసు నమోదైంది. ఈ పరిమాణాలన్నీ చూస్తే డీఎస్‌కు పొగబెడుతున్నట్లేనని అంతా అభిప్రాయ‌ప డుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు సాగుతోంది. నిజామాబాద్‌లో ఇది ఒకింత ఎక్కువ‌గానే ఉంది. ఎంపీగా కవిత ప్రాతినిధ్యం వహిస్తుండడం, జిల్లా అంతటా ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉండడంతో అంతర్గత పోరు అధికంగానే ఉంది. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకుండా పోయిందని, నేతలంతా ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

దానికే దిక్కులేదు…..

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తో ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి విబేధాలు ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో.. భూపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి కేసీఆర్‌కు పంపారు. డి.శ్రీనివాస్ కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని రెండు నెలలక్రితం జిల్లా నేతలు తీర్మానించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా కలకలం రేపిన ఈ రెండు ఫిర్యాదులనూ సీఎం పెండింగ్‌లో ఉంచారు. అనూహ్యంగా డీఎస్‌ తనయుడు సంజయ్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు అందడం పోలీసు శాఖ శరవేగంగా స్పందించడం నిర్భయ సహా నాలుగు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ఉన్నట్లుండి తెరపైకి…..

నిజానికి సంజయ్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఉన్నట్టుండి ఇప్పుడే వాటిని తెరపైకి తెచ్చి కేసులు నమోదు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. డి.శ్రీనివాస్‌, ప్రస్తుతం అధికార పార్టీలోనే కొనసాగుతున్నా, తనయుడిపై కేసు విషయంలో నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి ఉంటే.. తన పరిస్థితి, కేసు తీవ్రత మరో విధంగా ఉండేదని, పార్టీ నుంచి తనను పొమ్మనలేకే పొగబెడుతున్నారన్న వాదనను ప్రజలకు వినిపించేందుకు డీఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో, డిఎస్‌, రాహుల్ పర్యటనలోపే కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*