కొడుకు తెచ్చిన కష్టమేనా…?

కుమారుడి రాజకీయమే తండ్రి రాజకీయ పయనానికి ఆటంకంగా మారింది. కుమారుడి స్వతంత్ర రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు తండ్రికి కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)..ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంతో మందికి బీఫామ్ లు ఇచ్చి గెలిపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత తగ్గిందని భావించారు. అదే సందర్భంలో ఓ ఎమ్మెల్సీ ఎంపిక తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందనే చిన్న కారణంతో తనకు ఎంతో పెద్దపీట వేసిన స్వంత పార్టీని వదిలి గులాబీ కండువా కప్పుకున్నారు. సీనియర్ నేతగా కేసీఆర్ ఆయనకు తగిన గౌరవం ఇచ్చారు. పార్టీలోకి రాగానే క్యాబినెట్ హోదాతో సలహాదారుగా తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో వారసుల రాజకీయ జీవితం డి.శ్రీనివాస్ కి కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న ఆయనకు టీఆర్ఎస్ లో అవమానాలు ఎదురవుతున్నాయి.

ప్రధాన ప్రత్యర్థిగా మారిన అరవింద్….

డీఎస్ చిన్న కుమారుడు అరవింద్ వృత్తిరిత్యా వ్యాపారవేత్త. రియల్ ఎస్టేట్ రంగంలోగా బాగానే పేరుగడించారు. ఎందుకో ఆయన కన్ను రాజకీయాలపై పడింది. తండ్రి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయనకు భారతీయ జనతా పార్టీపైన మనస్సు పడింది. కుమారుడి నిర్ణయాన్ని తండ్రి వ్యతిరేకంచారో లేదో తెలియదు కానీ అరవింద్ బీజేపీలో చేరడం..చురుగ్గా మారిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆయన ఉత్సాహాన్ని పసిగట్టిన ఆ పార్టీ పెద్దలు అరవింద్ ను నిజామాబాద్ ఎంపీ స్థానానికి నిలబెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎంపీగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత రూపంలో బలమైన ప్రత్యర్థికి పోటీ ఇవ్వాలంటే అరవింద్ సరైన వ్యక్తి అని భావించి, అరవింద్ కు టిక్కెట్ పై మౌఖిక హామీ ఇచ్చారు. దీంతో అరవింద్ రంగంలోకి దిగారు. నిజామాబాద్ లో వరుస కార్యక్రమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అరవింద్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజాం షుగర్స్ ను తిరిగి ప్రారంభించాలని సరైన పాయింట్ పట్టుకుని పోరాడుతున్నారు. బీజేపీ పెద్దల అంచనాలు మించి పనిచేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మధు యాష్కి గౌడ్ నియోజకవర్గ రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేకపోవడంతో ఇప్పుడు అరవింద్ కవితకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. వీలు దొరికినప్పుడల్లా కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అవమానకర పరిస్థితి…

టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో బీజేపీ తరుపున అరవింద్ గెలుస్తారా అనే అనుమానాలున్నా ప్రస్థుతానికి మాత్రం ఎంపీ కవితకు మింగుడుపడకుండా మారిపోయారు. ఇదే సందర్భంలో తండ్రి టీఆర్ఎస్ లో, కుమారుడు బీజేపీలో ఉండటంతో వారి అనుచరుల్లో, క్యాడర్ లో అయోమయం నెలకొంది. అయితే, తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని డీఎస్ క్యాడర్ కు అనధికారికంగా చెబుతున్నారనేది టీఆర్ఎస్ నేతల ఆరోపణ. అందునా స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురికి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తికి తమ పార్టీ ఎంపీ మద్దతు ఇస్తున్నారనే ప్రచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అంతా కలిసి ముకుమ్మడిగా డీఎస్ కు వ్యతిరేకంగా పార్టీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు డీఎస్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిశారని ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే డీఎస్ కు టీఆర్ఎస్ లో పొగబెడుతున్నట్లే కనపడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వెలుగువెలిగిన డీఎస్ కుమారుడి రాజకీయంతో టీఆర్ఎస్ లో అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరి డీఎస్ ఏం చేస్తారనేది ఆసక్తికర పరిణామం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*