కాసేపట్లో డీఎస్ ఏం చెబుతారు?

సీనియర్ నేత డి.శ్రీనివాస్ నేడు కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో తన అనుచరులతో సమావేశమైన డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగాలా? వద్దా? అన్న దానిపై చర్చించారు. ఎక్కువ మంది అనుచరులు పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. మరికాసేపట్లో డీఎస్ మీడియా సమావేశం పెట్టనున్నారు. ఈ సమావేశంలో డీఎస్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ప్రగతి నివేదన సభకు కూడా……

ఇటీవల జరిగిన ప్రగతి నివేదన సభకు డీఎస్ ను ఆహ్వానించలేదు. నిజామాబాద్ లో జరుగుతున్న ఏ పార్టీ కార్యక్రమాలకూ డీఎస్ ను పిలవడం లేదు. మూడు నెలల క్రితం డీఎస్ పై నిజామాబాద్ జిల్లా నేతలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో సహా అందరు టీఆర్ఎస్ నేతలూ కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్ తాను కేసీఆర్ ను స్వయంగా కలిసి వివరణ ఇచ్చుకోవాలనుకున్నారు.

అపాయింట్ మెంట్ దొరకక….

కాని మూడు నెలల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి డీఎస్ హాజరయినా కేసీఆర్ పలుకరించలేదు. ప్రగతి నివేదన సభకు కనీసం పిలవలేదు.తనను పక్కన పెట్టారన్న విష‍యం అర్థమైన  డీఎస్ కొంత మనస్థాపానికి గురయ్యారు. తన పెద్దకుమారుడు సంజయ్ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారని డీఎస్ భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తనను పూర్తిగా పక్కన పెట్టిన పార్టీలో ఉండటం వృధా అని డీఎస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఈరోజు డీఎస్ విలేకర్ల సమావేశంలో వెల్లడించే అవకాశముంది. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తారా? లేక హుందాగా తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*