డీఎస్ వల్లనే…ఆయన…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈ మేరకు మంత్రి కె.టి.రామారావు సురేశ్ రెడ్డితో జరపిన చర్చలు సఫలమయ్యాయి. అయితే సురేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీ లభించిందని చెబుతున్నారు. తాను పార్టీని వీడుతున్నట్లు సురేశ్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ కుచెందిన సురేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. సురేశ్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. దీంతో సురేశ్ రెడ్డి పార్టీలో చేరడం ఖాయమయిపోయింది.

సురేశ్ రెడ్డి పార్టీలో చేరడానికి……

సురేశ్ రెడ్డి పార్టీలో చేరడానికి కారణాలేంటని విశ్లేషిస్తే అందుకు ప్రధాన కారణం డి. శ్రీనివాస్ అని తెలుస్తోంది. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. టీఆర్ఎస్ ఆయనకు తొలుత ప్రభుత్వ సలహాదారుగా తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. అయితే డీఎస్ చిన్నకుమారుడు బీజేపీలో చేరి కీలకంగా మారడం, నిజామాబాద్ టీఆర్ఎస్ స్థానిక నేతలతో డీఎస్ కు పొసగక పోవడంతో ఆయనను పార్టీ పక్కనపెట్టింది. ఇటీవలే నిజామాబాద్ జిల్లా కు చెందిన టీఆర్ఎస్ నేతలు డీఎస్ పై కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది.

డీఎస్ చేరికకు అభ్యంతరం చెబుతున్నా…..

డీఎస్ కాంగ్రెస్ లో చేరడంపై సురేశ్ రెడ్డి గత కొంతకాలం నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఈ విషయం చెప్పారు. అయితే ఉత్తమ్ నుంచి సురేశ్ రెడ్డికి డీఎస్ చేరరన్న హామీ లభించలేదు. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెబుతున్నా రాష్ట్ర నాయకత్వం ఏమీ చేయలేకపోయింది. డీఎస్ కు కాంగ్రెస్ అధిష్టానంతో పట్టు ఉంది. నేరుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో మాట్లాడే చనువు ఉంది. ఈ నేపథ్యంలో డీఎస్ తన అనుచరులతో త్వరలోనే పార్టీలో చేరతారన్న వార్తలు కూడా వచ్చాయి.

మరికొందరు కూడా….

డీఎస్ చేరిక ఇష్టం లేని సురేశ్ రెడ్డి పార్టీని వీడటానికే నిర్ణయించుకున్నారు. అందుకే మంత్రి కె.టి.రామారావు ఇంటికి రాగానే సాదరంగా ఆహ్వానించి చర్చలు జరిపారు. సురేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సురేశ్ రెడ్డితో పాటు మరికొందరు నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు తరాలు తమ కుటుంబం కాంగ్రెస్ లో ఉందని సురేశ్ రెడ్డి చెబుతున్నారు. డీఎస్ విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ సురేశ్ రెడ్డి పార్టీని వీడటానికి డీఎస్ కారణమన్నది సుస్పష్టంగా తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*