దేవెగౌడ…కొత్త ఎత్తుగడ…?

దేవెగౌడ కొత్త ఎత్తులు వేస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో జనతాదళ్ ఎస్ పట్టు సాధించడంతో కర్ణాటకతో పాటు జాతీయ రాజకీయాల్లో తమ కుటుంబం ముద్ర ఉండాలని పెద్దాయన తాపత్రయపడుతున్నట్లు ఉంది. కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అనగానే దేవెగౌడ కుటుంబ పార్టీ అని చెప్పక తప్పదు. జాతీయ పార్టీలైన భారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ వంటి వాటికి ధీటుగా దేవెగౌడ తన పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. బీజేపీతోనైనా, కాంగ్రెస్ తోనైనా అధికారం కోసం ఎవరితోనైనా ఆయన కలిసేందుకు ఎటువంటి భేషజాలు చూపరు. పవర్ తో పాటు కీర్తి ముఖ్యమనుకునే ఈ పెద్దాయన వచ్చే లోక్ సభ ఎన్నికలపైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కుమారను పంపుతారా?

గత కొంతకాలంగా కన్నడ నాట ఒక ప్రచారం జరుగుతోంది. తనకు వయసు మీరడంతో జాతీయ రాజకీయాల్లోకి ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామిని పంపాలన్నది దేవగౌడ అభిప్రాయమన్న ప్రచారం జరుగుతోంది. కుటుంబసభ్యులందరూ కలసి తీసుకున్న నిర్ణయమని కూడా వదంతులు వచ్చాయి. కుమారస్వామిని లోక్ సభకు పంపి మరో కుమారుడు రేవణ్ణకు ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న యోచనలో కూడా దేవెగౌడ ఉన్నారన్న గుసగుసలు విన్పించాయి. అయితే ఈప్రచారం ఉత్తిదేనని రేవణ్ణ ఇటీవల ఖండిచారు కూడా. కుమారస్వామి లోక్ సభకు పోటీచేస్తారో లేదో తెలియదు కాని తాను మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేనని ఆయన అన్నారు. దీంతో ఈప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.

లోక్ సభఎన్నికలపై కసరత్తు…..

అయితే తాజాగా దేవెగౌడ కుటుంబం లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టడం, వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలని దేవెగౌడ భావిస్తుండటంతో లోక్ సభ స్థానాలపై కూడా ఆయన కుటుంబంలో చర్చలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు పొత్తుపెట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఎక్కువ స్థానాలను అడగాలని దేవెగౌడ భావిస్తున్నారు. ఇప్పటికింకా రెండు పార్టీల మధ్య చర్చలు ప్రారంభం కాకపోయినా త్వరలోనే దీనిపై పార్టీ అధినేత రాహుల్ తో దేవెగౌడ స్వయంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగానే తమకు బలమున్న ప్రాంతాలతో పాటు మరికొన్ని సీట్లు, అభ్యర్థుల జాబితాను కూడా రూపొందించే పనిలో ఉన్నారట పెద్దాయన.

ఈసారి ముగ్గురు బరిలో…..

ఈసారి ఎన్నికల్లో కూడా తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని చూస్తున్నారు. మొత్తం ముగ్గురు దేవెగౌడ్ కుటుంబం నుంచి పోటీ చేసే అవకాశమున్నట్లు తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దేవెగౌడ కూడా స్వయంగా ఈసారి కూడా ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఆయనఈసారి మాండ్య పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే హాసన్ నుంచి తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్నారు. హాసన్ జేడీఎస్ కు పట్టున్న స్థానం కావడంతో గెలుపు సులువవుతుంది. అలాగే మూడో స్థానం ఎక్కడ? మూడో వ్యక్తి ఎవరు? అన్న దానిపైనే సస్పెన్స్ కొనసాగుతుంది. దేవెగౌడ కుటుంబంలోని మూడో వ్యక్తి కుమారస్వామి భార్య అనిత అని కొందరు చెబుతుండగా, కుమారస్వామేనంటూ మరికొందరు చెబుతున్నారు. మొత్తం మీద దేవెగౌడ తన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉపయోగించి కుటుంబాన్ని రాజకీయంగా స్ట్రాంగ్ చేయాలని భావిస్తున్నారు. మరి దేవెగౌడ ఎత్తుగడలు పనిచేస్తాయా? లేదా? అన్నది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*