దళపతి సెంటిమెంట్ చూశారూ…..!!!

దేవెగౌడ ఆశలు ఆకాశంలో విహరిస్తుంటాయి. తొంభయ్యోపడికి చేరువలో ఉన్నా భవిష్యత్ పై ఆశలు సన్నగిల్లలేదు. తలలు బోడులైనా తలపులు బోడు కావన్న సామెత చందాన ఆయన తనకు రాజకీయంగా కాలం కలసి వస్తుందని బలంగా భావిస్తున్నారు. ముహూర్తాలు, జ్యతిష్యాన్ని పూర్తిగా విశ్వసించే దేవెగౌడ 2019 లో తనకు రాజకీయ యోగం పట్టనుందని విశ్వసిస్తున్నారు. ఇందుకోసం తన వంతు ప్రయత్నాలు కూడా చిత్తశుద్ధితో చేస్తున్నారు. మళ్లీ ప్రధాని అవుతానన్న ఆశతో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తన నివాసాన్ని కూడా మార్చారు. ప్రస్తుతం ఉన్న అధికార నివాసాన్ని కాదని1996లో తాను నివసించిన పాత ఇంటికి మకాం మార్చారు. అప్పట్లో ఆయన సప్ధర్ జంగ్ రోడ్డులోని ఓ భవంతిలో ఉండేవారు. అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని అయ్యారు. నాటి ఎన్నికల్లో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ ఓడిపోవడం, ఏ పార్టీకి మెజారిటీలేని నేపథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్ధిగా ప్రధాని పదవి ఒక్కసారిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా బెంగళూరులో కలక్షేపం చేస్తున్న దేవెగౌడ ఢిల్లీకి వెళ్లారు. 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ వరకూ ఆయన ప్రధానిగా కొనసాగారు. అప్పటికి ఆయన లోక్ సభ సభ్యుడు కూడా కాదు. ప్రధాని పదవి చేపట్టడంతో అనివార్యంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రెండు దశాబ్దాలకు పైగా రాజకీయంగా వనవాసం చేస్తున్నారు. అప్పడడప్పుడు జాతీయ రాజకీయాల్లో కనపడతున్నప్పటికీ పూర్తిగా కర్ణాటకకే పరిమితమయ్యారు.

పాలిటెక్నిక్ అయినా పాలిటిక్స్ లో…..

1993 మే 18న హావెనరసిపుర తాలూకా హర్బనహళ్లి గ్రామంలో జన్మించిన దేవెగౌడ పెద్ద చదువులు చదవలేదు. పాలిటెక్నిక్ కే పరిమితం అయినప్పటికీ పాలిటిక్స్ లో ఓనమాలు బాగానే ఒంటబట్టించుకున్నారు. ఒక్కలింగ సామాజిక వర్గంలో జన్మించిన దేవెగౌడ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. 1953 నుంచి 1962 వరకూ హోలెనరసిపురలోని ఆంజనేయ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత హోలెనరసిపుర తాలూకా అభివృద్ధి బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించారు. 1962లో హోలెనరసిపుర స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక అప్పటి నుంచి రాజకీయంగా వెనుదిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. అదే స్థానం నుంచి 1989 వరకూ అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చారు. 1972 నుంచి 1976 వరకు, 1976 డిసెంబరు నుంచి 1977 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1977లో అత్యవసర పరిస్థితి సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను అరెస్ట్ చేయించి బెంగళూరు జైల్లో నిర్భంధించారు.

ముఖ్యమంత్రిగా… ప్రధానిగా…..

రెండు సార్లు రాష్ట్ర జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గౌడ 1983 నుంచి 1988 వరకూ రామకృష్ణ హెగ్డే మంత్రివర్గంలో పనిచేశారు. 1994లో జనతాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీని విజయపథంలో నడిపించారు. నాటి ఎన్నికలలో బెంగళూరు నగర శివార్లలోని రామనగర నుంచి గెలుపొందారు. 1994 డిసెంబరులో రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఏడాదిన్నరలో ఆయన దిశ తిరిగింది. 1996లో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ఒక్కసారిగా ప్రధాని పదవి చేపట్టారు. ఏడాది లోపే ప్రధానిగా పనిచేసినప్పటికీ తనదైన ప్రభావాన్ని చూపలేకపోయారు. 11వ ప్రధానిగా ఆయన విఫలమయ్యారని చెప్పకతప్పదు. అప్పటి నుంచి రాజకీయంగా వనవాసం అనుభవిస్తున్నారు. సొంత నియోజకవర్గం మండ్య నుంచి మాత్రం వరుసగా లోక్ సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. 2014లో కూడా లోక్ సభకు ఎన్నికయ్యారు. రాజకీయంగా వేసిన తప్పటడుగులు కారణంగా ఆయన పార్టీ జనతాదళ్ ఎస్ ఉప ప్రాంతీయ పార్టీగా మిగిలి పోయింది. ఒక్కలింగ సామాజిక వర్గ పార్టీగా గుర్తింపు పొందింది. పాత మైసూరు లోని కొన్ని ప్రాంతాలకే పార్టీ పరిమితమైంది. 1996 నుంచి ఏనాడూ పూర్తి స్థాయి ఆధిక్యాన్ని సంపాదించుకోలేకపోయింది.

మకాం మార్చినంత మాత్రాన……

గౌడ కుటుంబం చాలా పెద్దది. నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అబ్బాయిల్లో కుమారస్వామి ప్రస్తుత ముఖ్యమంతి. రెండో కుమారుడు హెచ్.డి.రేవణ్ణ రాష్ట్ర మంత్రి. కోడలు, అల్లుళ్లు, మనుమలు, మనమరాండ్రతో కలిపితే గౌడ వంశవృక్షం విస్తృతమైంది. ప్రస్తుతం కుటుంబ పరస్థితులను చక్కదిద్దడం కష్టంగా మారింది. వారి రాజకీయ ఆకాంక్షలను తీర్చడం శక్తికి మించిన పనిగా ఉంది. కోడలు అనిత ఈనెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో రామనగర నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజకీయంగా తప్పుడు నిర్ణయాల వల్ల లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ప్రకాశ్, మైనారిటీ వర్గానికి చెందిన సీఎం ఇబ్రహీం, ఓబీసీకి చెందిన సిద్ధరామయ్యలు దూరమయ్యారు. వీరంతా ఒకప్పుుడు దేవెగౌడ శిష్యులు. గతాన్ని మరిచి రాజకీయ భవిష్యత్తుపై ఆశావహంగా ఉన్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో రాజీ అభ్యర్థిగా తన పేరు తెరపైకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. అందుకే ఆయన తనకు అచ్చొచ్చిన భవనంలోకి మకాం మార్చారు. సీనియారిటీ, దక్షిణాది నేపథ్యం, రైతు కుటుంబం నుంచి రావడం తనకు సానుకూల అంశాలని భావిస్తున్నారు. “జాతీయ స్థాయికి తక్కువ, ప్రాంతీయ స్థాయికి ఎక్కువ”… ఇదీ గతంలో గౌడ గురించి ఓ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య. ఇది ముమ్మాటికీ నిజం కూడా. మకాం మార్చినంత మాత్రాన ప్రధాని అవుతారా..? ఏమో చూడాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*