దేవెగౌడ దాటేశారా?

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితం చాలా కీల‌కం. క‌న్నడ ప్రజ‌ల తీర్పుపైనే ఫ్రంట్ ఏర్పాటు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఆయ‌న‌కు తెలుసు. ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ విజ‌యం సాధిస్తేనే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు మార్గం సుగ‌మ‌మం అవుతుంది. క‌లిసొచ్చే ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసేందుకు ఆయ‌న కొద్ది రోజులుగా తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయ‌న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కూడా క‌లిసి వ‌చ్చారు. ఇక ఆయ‌న క‌ర్ణాట‌క వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్ నేత‌ దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమార‌స్వామితో భేటీ అయ్యారు.

కూటమి సాధ్యమేనా?

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ జేడీఎస్ నేత‌ల‌తో స‌మావేశం కావ‌డం రాజ‌కీయ ప్రాధాన్యతను సంత‌రించుకుంది. కేసీఆర్ ప‌ర్యటన‌లో అనేక రాజ‌కీయ కోణాలు దాగి ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇంత‌కీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో దేవేగౌడ‌ ఏం మాట్లాడారు..? అస‌లు వారి మ‌ధ్య కూట‌మి మాట వ‌చ్చిందా..? ఫ్రంట్ ఏర్పాటుపై దేవేగౌడ కేసీఆర్‌కు హామీ ఇచ్చారా.. అన్నదే ఇప్పుడు అంద‌రి మెద‌ళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. భేటి అనంత‌రం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో మాత్రం దేవేగౌడ కూట‌మి మాట‌ను దాటేసి మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ‌లో జ‌న రంజ‌క పాల‌న సాగుతోంద‌ని, అసేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌నీ సీఎం కేసీఆర్‌ను ప్రశంస‌లతో ముంచెత్తారు.

కేసీఆర్ పై ప్రశంసలు……

రైతుల కోసం సీఎం కేసీఆర్ చేప‌డుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయ‌ని దేవేగౌడ అన్నారు. ఇక కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కూడా దేవేగౌడ మ‌ద్దతు ఇచ్చార‌ని అన్నారు. విలేక‌రుల స‌మావేశంలో ఈ ఇద్దరు నేత‌లు ఇంత‌కుమించి మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌ర్ణాటక ఎన్నిక‌ల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. మ‌ళ్లీ కాంగ్రెస్ గెలుస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. ప్రీపోల్ స‌ర్వేలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి. ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ ఉంది. ప్రస్తుతం ఎవ‌రికీ మెజారిటీ రాద‌నీ, అందుకే తామే కింగ్ మేక‌ర్‌గా ఉంటామ‌న్న ధీమాలో జేడీఎస్ ఉంది. ఇదిలా ఉండ‌గా.. ఉనికిని కాపాడుకునే స్థితిలో జేడీఎస్ నేత‌లు దేవేగౌడ‌, కుమార‌స్వామి ఉన్నారు.

ఇద్దరితో టచ్ లో ఉన్నారా?

ఈక్రమంలోనే జేడీఎస్‌పై రెండు ర‌కాలుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పటికే కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి సిద్ధరామ‌య్య, జేడీఎస్ నేత దేవేగౌడ ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌నీ, ఎక్కువ సీట్లు వ‌స్తే త‌మ‌కే ముఖ్యమంత్రి ప‌ద‌వి అప్పగించాల‌ని దేవేగౌడ పెట్టిన ష‌ర‌తుకు సిద్ధు అంగీక‌రించార‌నే టాక్ వినిపించింది. ఒక‌వేళ 40కంటే త‌క్కువ సీట్లు వ‌స్తే కీల‌క ప‌ద‌వులు ఇచ్చేందుకు కూడా సిద్దు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే స‌మ‌యంలో బీజేపీతో కూడా జేడీఎస్‌కు ర‌హ‌స్య అవ‌గాహ‌న ఉన్నట్లు తెలిసింది. ఇలా ఊగిస‌లాట‌లో ఉన్న జేడీఎస్ నేత దేవేగౌడ ఫ్రంట్‌పై కేసీఆర్‌కు క‌చ్చిత‌మైన హామీ ఇవ్వలేద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌మ‌తా బెనర్జీ కూడా కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటుపై హామీ ఇవ్వలేదు. ఏదేమైనా కేసీఆర్ ఫ్రంట్ క‌ల‌లకు ఆదిలోనే హంస‌పాదు ఎదుర‌వుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*