చిక్కుల్లో దేవేంద్రుడు…..!

విద్య, ఉద్యోగాల్లో గత కొద్దిరోజులుగా మారఠాలు చేస్తున్న ఆందోళనలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పూనే ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ రిజర్వేషన్ చిచ్చు రాజుకుంది. మరాఠా రిజర్వేషన్ల కోసం మరాఠా క్రాంతి మోర్చా పెద్దయెత్తున ఉద్యమాలను నిర్వహిస్తుంది. విద్య,ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈ సందర్భంగా పలువురు మారాఠా యువకులు రిజర్వేషన్లు కాంక్షిస్తూ ఆత్మబలిదానాలకు పాల్పడటంతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాని మరాఠా రిజర్వేషన్లు సాధ్యమేనా? సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఈ రిజర్వేషన్లు అమలుచేయడం అసాధ్యమని ప్రభుత్వమే ఒక పక్క అంగీకరిస్తుంది.

శాంతించడమెలా?

కాని మరాఠాలు శాంతించడం లేదు. కన్పించిన ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలను ధ్వంసం చేయడం, దహనంచేస్తుండటంతో మహారాష్ట్రలోని అనేక చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక వచ్చేది ఎన్నికల సీజన్. లోక్ సభ , రాష్ట్ర ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో మరాఠాలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తమ డిమాండ్ ను నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. శివసేన వంటి పార్టీలు కూడా మరాఠాల ఉద్యమానికి మద్దతు పలికాయి. దీంతో రోజురోజుకూ ఉద్యమం తీవ్ర రూపందాలుస్తోంది. మరాఠాల ఉద్యమాలపై ప్రభుత్వం కూడా స్పందించింది. చర్చలకు ఆహ్వానించింది. అయినా ఉద్యమ వేడి చల్లార లేదు.

నిర్ణయాత్మక శక్తి కావడంతో…..

మహారాష్ట్రలో మరాఠాలదే ఆధిపత్యం. అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే శక్తి మరాఠాలకు ఉంది. ఆర్థిక బలం వారికి పుష్కలంగా ఉంది. మహారాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ఉన్న మారాఠాలకు ప్రభుత్వం దిగిరాక తప్పదు. అయితే ఈసమస్యకు పరిష్కారం కష్టమేనంటున్నారు నిపుణులు. ఇప్పటికే మహారాష్ట్రలో యాభై శాతం రిజర్వేషన్లు అమలువుతున్నాయి. మరాఠాలు 16శాతం రిజర్వేషన్లు కోరుతున్నారు. ఓబీసీలో తమను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓబీసీలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. బలమైన మరాఠాలను తమలో చేరిస్తే తాము బలహీన పడతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆందోళనచేసినప్పడు 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి రిజర్వేషన్లను కల్పిస్తూ ఒక ఆర్డినెన్సును కూడా జారీ చేసింది. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం సంయమనం పాటిస్తున్నారు.

సీఎం స్పష్టంగా చెబుతున్నా…..

తన చేతుల్లో లేదని, రిజర్వేషన్ల పెంపునకు సుప్రీంకోర్టు తీర్పు అంగీకరించదని ఒకవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెబుతూనే ఉన్నారు. నిజానికి మరాఠాలు తొలినుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మద్దతిస్తూవచ్చారు. గత ఎన్నికలలో మాత్రం మరాఠాలు అధికశాతం మోదీకి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం దేవేంద్ర ఫడ్నవిస్ కు చికాకును కల్గిస్తుంది. ప్రస్తుతానికి ఉద్యమాన్ని చల్లార్చేందుకు ఏదో ఒక ప్రకటనచేసినా అది తమకు మద్దతిచ్చే ఇతర సామాజిక వర్గాల పై పడి ఓటు బ్యాంకు దూరమవుతందని బీజేపీ భావిస్తోంది. ప్రధానంగా ఓబీసీలు దూరమవుతారని అది ఆలోచిస్తోంది. దీంతోనే ఫడ్నవిస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఢిల్లీ వైపు చూస్తున్నారు. మొత్తం మీద మరాఠాల రిజర్వేషన్ల ఉద్యమం అట్టుడుకుతుండగా, బీజేపీ సర్కార్ మాత్రం ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం తప్పక ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*