దేవినేనిని జగన్ దెబ్బ కొడతారా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో జరుగుతోంది. ప్రస్తుతం జగన్ పై మాటలు తూటాలు పేల్చే దేవినేని ఉమామహేశ్వరరావు నియోజక వర్గమైన మైలవరంలో జగన్ పాదయాత్ర ప్రారంభమవుతోంది. మైలవరం నియోజకవర్గం టీడీపికి కంచుకోట. 2009 ఎన్నికల్లోనూమైలవరంలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో నందిగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. అయితే నందిగామ రిజర్వ్ కావడంతో ఆయన తన స్థానాన్ని మైలవరానికి మార్చుకున్నారు.

కాంగ్రెస్ కు కంచుకోటగా…..

మైలవరం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 1955, 1962 ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ అభ్యర్థి వెల్లంకి విశ్వేశ్వరరావు విజయం సాదించారు. ఆ తర్వాత ఇక ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పరమైంది. 1967, 1972,1978 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా చనుమోలు వెంకట్రావు, సీవీ రావులు గెలుపొందారు. 1983లో నిమ్మగడ్డ సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1985లో తిరిగి చనుమోలు వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1989లోనూ ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పరమైంది. అయతే 1994,1999లో ఈనియోజకవర్గం నుంచిటీడీపీ అభ్యర్థిగా జేష్ట రమేష్ బాబు, వడ్డే శోభనాద్రీశ్వరావులు విజయంసాధించారు. 2004లో మళ్లీ ఈ నియోజకవర్గం నుంచి చనుమోలు వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.

2009 లో మైలవరానికివచ్చిన…..

ఇక 2009 ఎన్నికల నాటికి అప్పటి వరకూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగామ నియోజకవర్గం రిజర్వ్ డ్ కావడంతో దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరాన్ని ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని ఉమ, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ పై దాదాపు 13 వేల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో కూడా ఉమా ఆధిపత్యమే ఇక్కడ కొనసాగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమ, వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ పై సుమారు ఎనిమిది వేల ఓట్ల ఆధికత్యతో విజయం సాధించడం విశేషం.

దేవినేనిపై ఆరోపణలు….

ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా దేవినేని ఉమ తన దైన శైలిలో వైఎస్ పైన, ప్రభుత్వంపైన విమర్శలుచేస్తూ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచేవారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమ ఏకంగా కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవిని దక్కించుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న దేవినేని జగన్ పై విరుచుకుపడటంలో ముందుంటారు. ముఖ్యంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై వైసీపీ ఇటీవల విరుచుకుపడుతుంది. బీజేపీ నేతలు కూడా అదే పనిగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో జగన్ దేవినేనిపై విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. దేవినేని ఆధిపత్యానికి తెరదించాలన్నది వైసీపీ ప్రయత్నం. మరి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈసారైనా ఇక్కడ ఎన్నికల ఫలితాల్లో మార్పు తెస్తుందా? వేచి చూడాలి.

నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే…..

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు మైలవరంలో జరగనుంది. 138వ రోజుకు జగన్ పాదయాత్ర చేరుకుంది. నిన్న ఏపీ బంద్ కావడంతో ఒకరోజు పాదయాత్రకు జగన్ విరామమిచ్చారు. మంగళవారం ఉదయం కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ముత్యాలంపాడు, ఆతుకూరు, చెవుటూరు, క్రాస్ రోడ్స్ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ భోజన విరామానికి జగన్ కొద్దిసేపు ఆగుతారు. అక్కడి నుంచి కొంటముక్కల క్రాస్ రోడ్స్, గురరాజు పాలెం నుంచి మైలవరం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి మైలవరంలోనే జగన్ బస చేస్తారు. మైలవరంలో జరిగే బహరంగ సభలో జగన్ ప్రసంగస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*