మంత్రి ఉమకు ఆ సమస్య..తేడా కొడుతోందా..?

కృష్ణా జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం. అయితే, ఇక్క‌డ వ‌ల‌స నేత‌లే త‌ప్ప స్థానికంగా ఎవ‌రూ ఎదగ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. స్థానికంగా కీల‌క‌మైన నేత‌లు ఎద‌గ‌క పోవ‌డంతో పార్టీలు వేరే ప్రాంతానికి చెందిన వారిని తెచ్చి ఇక్క‌డి టికెట్ ఇస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉండే స‌మ‌స్య‌ల‌పై వాళ్ల‌కు అవ‌గాహ‌న వ‌చ్చేందుకు బోలెడు స‌మ‌యం ప‌డుతోంద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత సొంత ప్రాంతానికి చెందిన చనమోలు వెంకట్రావ్‌, కోమటి భాస్కరరావు, జ్యేష్ఠ రమేష్‌బాబు మాత్ర‌మే ఇక్క‌డ ప్రాతినిధ్యం వ‌హించారు. ఆ త‌ర్వాత మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. ఇక్క‌డ వ‌ల‌స నేత‌లే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

వడ్డే హయాం నుంచే….

టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు హ‌యాం నుంచి ఇక్కడ వ‌ల‌స నేత‌ల ప్ర‌భావం ఎక్కువైంది. 1999లో టీడీపీ తరుపున వడ్డే శోభనాధ్రీశ్వరరావు స్థానికుడైన కోమటి సుధాకరరావుతో పోటీకి దిగడంతో మైలవరం నియోజకవర్గంలో వలస సంస్కృతికి బీజం ప‌డింది. ఆ ఎన్నికల్లో గెలిచిన వ‌డ్డే.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఐదేళ్లు పని చేశారు. వ‌డ్డే మంత్రిగా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇక‌, 2009లో నందిగామ నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నేత‌ దేవినేని ఉమామహేశ్వరరావు మైల‌వ‌రంలో తిష్ట వేశారు. స్థానికుడైన అప్ప సాని సందీప్‌పై విజ‌యం సాధించారు. మ‌ళ్లీ 2014లోనూ దేవినేని ఇక్క‌డ నుంచే పోటీ చేసి స్థానికుడైన జోగి రమేష్‌ పై గెలిచారు. ప్ర‌స్తుతం .. చంద్ర‌బాబు కేబినెట్‌లో దేవినేని మంత్రి కూడా అయ్యారు.

ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతూ…..

మంత్రిగా ఉన్న ఉమ ముందు మూడు సంవ‌త్స‌రాలు రాష్ట్ర రాజ‌కీయాలు, జిల్లా రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉంటూ స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను, నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక ఇప్పుడు వ‌చ్చే యేడాది ఎన్నిక‌లు ఉండ‌డంతో పాటు వైసీపీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి రంగంలో ఉంటార‌న్న వార్త‌ల‌తో ఆయ‌న ఎలెర్ట్ అవుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు. ఇక‌, ఇప్పుడు 2019 ఎన్నిక‌ల విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. టీడీపీ, వైసీపీలు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. దీంతో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్నీ నేత‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగానే భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

ఉమపై పోటీకి….

వైసీపీ విష‌యానికి వ‌స్తే.. త‌మ‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్న మంత్రి దేవినేని ఉమాను మ‌ట్టి క‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను దీటుగా ఎదుర్కొనే వారికి టికెట్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. 2014 ఎన్నికల్లో నియోజకవర్గ స్ధానికుడైన జోగి రమేష్‌, ఉమాపై స్వల్ప తేడాతో ఓటమి చెందినా అప్పటి నుంచి మైలవరం వైసీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతూ వస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉమ చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 6 వేల ఓట్ల మెజార్టీతో మాత్ర‌మే గెలిచారు.

వసంత కూడా నాన్ లోకల్….

ఈసారి వైసీపీ తరపున మైలవరం సీటు జోగికి కాకుండా వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయిస్తున్నారని పార్టీలో చేరక ముందే ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే మరో వలస నేత రాబోతున్నారన్న మాట. కృష్ణ ప్ర‌సాద్ కూడా స్థానికుడు కాదు. అయితే, దేవినేని సామాజిక వ‌ర్గం ఈయ‌న‌ది ఒక‌టే కావ‌డంతో మైల‌వ‌రంలో దేవినేనికి చెక్ పెట్టిన‌ట్ట‌వుతుంద‌ని భావించిన జ‌గ‌న్ .. ఆయ‌న‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో మైల‌వ‌రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు వ‌ల‌స నేత‌ల మ‌ధ్యే కానున్నాయి. విచిత్రం ఏంటంటే కృష్ణ‌ప్ర‌సాద్ కూడా నందిగామ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేతే. వీరిద్ద‌రు గ‌తంలో నందిగామ‌లో 1999లో పోటీప‌డ‌గా అప్పుడు ఉమ విజ‌యం సాధించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*