మరో రికార్డు మిస్ అవుతుందా…!

ప్ర‌త్య‌ర్థిని బ‌ట్టి ఎన్నిక‌ల్లో విజ‌యావ‌కాశాలు మారుతూ ఉంటాయి. కానీ ఆయ‌న ఎన్నిక‌ల పోటీలో దిగితే మాత్రం.. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా విజ‌యం ఆయ‌న సొంత‌మ‌వ్వాల్సిందే! ఒక‌టి కాదు రెండు కాదు ఏక‌ధాటిగా ఐదు సార్లు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి.. అందులోనూ రాష్ట్రంలో పార్టీ ఓడిపోయినా ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాత్రం గెలుపొందేది మాత్రం ఆయ‌నే! ఐదు సార్లు ఐదుగురు ప్ర‌త్య‌ర్థుల‌పై పోటీచేసి ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందుతున్న ఆయ‌న‌కు మాత్రం ప‌రిస్థితులు కొంత వ్య‌తిరేకంగా ఉన్నాయంటున్నారు విశ్లేష‌కులు.

తన రికార్డును తానే…..

ఐదుసార్లు ఐదుగురు ప్ర‌త్య‌ర్థుల‌పై గెలిచి.. త‌న రికార్డు తానే బ‌ద్ద‌లు కొట్టుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌ న‌రేంద్ర‌! 2019 ఎన్నిక‌లు టీడీపీతో పాటు ఆయ‌న‌కు కూడా స‌వాలు విసురుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌లైంది. ఈసారి కూడా గెలిచి డ‌బుల్ హ్యాట్రిక్ రికార్డును త‌న ఖాతాలో వేసుకుంటారా లేదా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక్క‌సారి ఎమ్మెల్యే టికెట్ సాధించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు నేత‌లు! కానీ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు వరస‌గా గెల‌వ‌డ‌మంటే రికార్డే మ‌రి! ఈ రికార్డులో మ‌రో ప్ర‌త్యేక‌త కూడా ఉంది. అదేంటంటే.. ఐదుసార్లు ఐదుగురు ప్ర‌త్య‌ర్థుల‌పై గెలవ‌డ‌మంటే మాట‌లు కాదు! ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా కాపాడుకుంటూ.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి నిరంత‌రం శ్ర‌మిస్తుంటేనే ఇటువంటి అరుదైన విజ‌యాలు ఖాతాలో వేసుకోగ‌లుగుతారు రాజ‌కీయ నాయ‌కులు.

తండ్రి వారసత్వాన్ని…..

నరేంద్రకుమార్‌ తండ్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరులోని పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1994లో టి వెంక‌ట్రామ‌య్య‌, 1999లో చిట్టినేని ప్ర‌తాప్‌, 2004లో ఎం.రాజాకిషోర్‌, 2009లో మారుపూడి లీలాధ‌ర్‌రావు, 2014లో రావి వెంక‌ట‌ర‌మ‌ణపై పోటీచేసి విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇలా ఐదుసార్లు వరుసగా విజయం సాధించిన నేతల సరసన నిలిచారు. ఆ మాట‌కు వ‌స్తే 1983 నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఫ్యామిలీయే టీడీపీ నుంచి పోటీ చేస్తోంది. న‌రేంద్ర తండ్రి వీర‌య్య చౌద‌రి 1983, 85లో విజ‌యం సాధించ‌గా 1989లో మాత్రం వీర‌య్య చౌద‌రి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఐదు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన న‌రేంద్ర వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు.

ఈ ఎన్నిక మాత్రం…..

అయితే 2019 ఎన్నిక‌లు టీడీపీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారాయి. గ‌త ఎన్నిక‌ల్లో మిత్రులుగా ఉన్న బీజేపీ, జ‌న‌సేన సొంతంగానే పోటీప‌డుతున్నాయి. మ‌రోప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అభివృద్ధి మంత్రాన్నే న‌మ్ముకుని టీడీపీ బ‌రిలోకి దిగాల్సిన అవ‌స‌ర‌ముంది. అంతేగాక గుంటూరు జిల్లాలో పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. అయితే ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి విష‌యంలో ప్ర‌జ‌ల్లో కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఐదు సార్లు ఏక‌ధాటిగా ఎమ్మెల్యేని గెలిపించామ‌ని, ఈ సారి కొత్త అభ్య‌ర్థికి అవ‌కాశ‌మిస్తే ఎలా ఉంటుంద‌నే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ ప‌రంగా, కొంత వ్య‌క్తిగ‌తంగానూ జిల్లాలో ప్ర‌తికూల వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తుండ‌టం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది.

సానుభూతితో…..

మ‌రోప‌క్క‌.. ఈసారి కూడా వైసీపీ నుంచి రావి వెంక‌ట ర‌మ‌ణ బ‌రిలోకి దిగే చాన్స్‌లు ఉన్నాయి. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సానుభూతితో పాటు అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్ ప్ర‌జ‌ల‌పై ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో న‌రేంద్రకు బ‌దులుగా ఓ షాడో ఎమ్మెల్యే పెత్త‌నం ఎక్కువ అవుతోంద‌న్న విమ‌ర్శ‌లు కూడా టీడీపీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి తోడు న‌రేంద్ర‌కు ఈ సారి తొలిసారే పాత ప్ర‌త్య‌ర్థి బ‌రిలో ఉంటున్నాడు. ఈ నేప‌థ్యంలో పొన్నూరులో ఈసారి ఆస‌క్తిక‌ర పోరు త‌గ్గ‌ద‌ని తెలుస్తోంది. మ‌రి ఈసారి కూడా గెలిచి డ‌బుల్‌ హ్యాట్రిక్ సాధిస్తారో లేదో వేచిచూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*