ఎందుకీ నైరాశ్యం.. రీజ‌న్ ఏంటి…?

dhulipallanarendra telugudesamparty

సుదీర్ఘ‌కాలంగా ప్ర‌జ‌ల నుంచి గెలుస్తున్న ఎమ్మెల్యేగా ఆయ‌న భారీ గుర్తింపునే పొందారు. రాష్ట్రంలో ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. ఎవ‌రూ కూడా ఆ రేంజ్‌లో వ‌రుస విజ‌యాలు సాదించ‌డం లేదు. ఆయ‌నే గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌. 1994లో ఏ ముహూర్తాన ఆయ‌న పొన్నూరు ఎమ్మెల్యేగా నామినేష‌న్ వేశారో కానీ, అప్ప‌టి నుంచి 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా వ‌రుస విజ‌యాలు సాధిస్తూనే ఉన్నారు. మెజారిటీ ఒకింత త‌గ్గినా.. పెరిగినా.. గెలుపు మాత్రం ధూళిపాళ్ల‌నే వ‌రిస్తూ వ‌స్తోంది. ఇక్క‌డ ఆయ‌న‌ను ఓడించేందుకు కాంగ్రెస్ స‌హా ఇతర రాజ‌కీయ ప‌క్షాలు చేయ‌ని ప్ర‌యోగం లేదు. అయినా కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లు న‌రేంద్ర‌ను గెలిపించ‌డం గ‌మ‌నార్హం. ఐదు సార్లు గెలుపొంది.. మ‌రోసారి కూడా విజ‌యానికి చేరువ అయి డ‌బుల్ హ్యాట్రిక్ సాధించాల‌ని క‌ల‌లు కంటున్న న‌రేంద్ర‌లో ఒక్క‌సారిగా నైరాశ్యం తొంగి చూస్తోంది.!

విపక్షంలో ఉన్నప్పుడు….

2004లో అప్ప‌టి కాంగ్రెస్ సీఎం వైఎస్ హ‌వాతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే గుంటూరులోనూ కాంగ్రెస్ హ‌వా న‌డిచింది. అయితే, ఒక్క పొన్నూరులో మాత్రం టీడీపీ గెలిచింది. నాడు జిల్లాలో ఉన్న 19 సీట్ల‌లో ఒక్క పొన్నూరు మిన‌హా మిగిలిన అన్ని సీట్ల‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇలా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్నారు న‌రేంద్ర‌. ఇక‌, పార్టీ ప్ర‌తిప క్షంలో ఉన్న‌ప్పుడు అధికార పార్టీని ముప్పుతిప్పులు పెట్టిన ఘ‌న‌త కూడా న‌రేంద్ర‌కే ద‌క్కుతుంది. సాక్ష్యాలు, ఆధారాల‌తో స‌హా న‌రేంద్ర అసెంబ్లీలో వైఎస్‌పైనా, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌పైనా విరుచుకుప‌డ్డ తీరు న‌భూతో అన్న విధంగా సాగింది. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం టీడీపీదే.! అయినా కూడా న‌రేంద్ర పార్టిసిపేష‌న్ అంతంత మాత్రంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న పెద్ద‌గా అటు పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ, ఇటు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మా ల్లోనూ కూడా పార్టిసిపేట్ చేయ‌డం లేదు. పైగా త‌న ప‌నితాను చూసుకుంటున్నారు.

ఒకప్పుడు కీలకంగా…..

ఒక‌ప్పుడు ఉమ్మ‌డి స్టేట్ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న ఆయ‌న ఇప్పుడు కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమిత‌మైపోయారు. మ‌రి ఒక్క‌సారిగా న‌రేంద్ర‌లో ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? ఆయ‌న ఎందుకు ఇలా మారిపోయారు? అని త‌ర‌చి చూస్తే.. చాలా చిత్ర‌మైన విష‌యం వెలుగు చూస్తుంది. దాదాపు పాతికేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌రేంద్ర అక‌ల‌పాన్పు ఎక్కారు. త‌న క‌న్నా జూనియ‌ర్ల‌ను పార్టీలోకి తీసుకుని మంత్రి ప‌ద‌వులు ఇస్తున్నార‌ని ఆయ‌న పైకే చెబుతున్న మాట కూడా. వాస్త‌వానికి మంత్రుల‌ను ప‌రిశీలించినా ఇదే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో న‌రేంద్ర పార్టీ, ప్రభుత్వ విష‌యాల్లో అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాటను విని ఉంటే న‌రేంద్ర ప‌రిస్థితి ఓ రేంజ్‌లో ఉండేద‌ని అంటున్న‌వారు కూడా ఉన్నారు. గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ చైర్మ‌న్‌గా న‌రేంద్ర ఉన్నారు. అయితే, ఈ ప‌ద‌విని వ‌దుల‌కుంటే మంత్రి ప‌ద‌విని ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు.

పదవిని వదులుకోనుంటే….?

కానీ, న‌రేంద్ర ఈ ప‌ద‌విని వ‌దుల‌కునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. జోడు ప‌ద‌వులు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాకుండా సంగం డెయిరీకి శాశ్వ‌తంగా త‌న ఫ్యామిలీనే చైర్మ‌న్ గిరీ చేసేలా ఆయ‌న తీర్మానం కూడా చేసుకున్నారు. ఈ ప‌రిణామాలు స‌హ‌జంగానే పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌లిగించాయి. దీంతో మంత్రి ప‌ద‌విలోకి న‌రేంద్ర‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ ఇద‌యితే.. త‌న‌కు మాత్రం పార్టీ ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని న‌రేంద్ర వాపోతున్నారు. పార్టీకి , ప్ర‌భుత్వానికి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోకుండా.. త‌న ప‌నేదో తాను చేసుకుని పోతున్నారు. మొత్తానికి నైరాశ్యంలో మునిగిపోయార‌నే వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న చేస్తున్న చ‌ర్య‌లు కూడా బ‌లంగానే క‌నిపిస్తున్నాయి. మ‌రి బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*