వారు వస్తారని వీరు…!!

తమిళనాడులో అన్నాడీఎంకే ఒంటరిగా మారనుందా? అధికారాన్ని పూర్తికాలం అనుభవించకముందే పక్కకు తప్పుకోవాల్సి వస్తుందా? ఇదే తమిళనాడులో హాట్ టాపిక్. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. మొత్తం 20 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీలూ హోరా హోరీ తలపడాలని ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల కొత్తగా స్థాపించిన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఉప ఎన్నికల వేడి మరింత రాజుకుంది.

మానసికంగా దెబ్బతీయాలని…..

అయితే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అధికార అన్నాడీఎంకే విపక్షాలను మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి తమ గూటికి రప్పించుకునేందుకు మంతనాలు జరుపుతోంది. ఉప ఎన్నికలకు ముందు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను కొందరినైనా తమ జట్టులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ప్రయత్నిస్తున్నారు.

భరోసా ఇస్తున్న…..

అమ్మ జయలలిత ఆశయాలు నెరవేరాలన్నా, రెండాకుల గుర్తుపై తిరిగి పోటీ చేయాలన్నా తమ వైపు రావాలంటూ ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు అందాయి. తిరిగి తమ చెంతకు వస్తే ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడమే కాకుండా ఎన్నికల ఖర్చు మొత్తం తామే భరిస్తామని ఆఫర్ లు కూడా ఇస్తున్నారు. దినకరన్ వెంట ఉంటే భవిష్యత్తు ఉండదని, తమ వెంట వస్తే రాజకీయంగా భవిష్యత్తుపై భరోసా ఇస్తామని నమ్మకంగా చెబుతున్నారు.

దినకరన్ సెట్ చేస్తున్నారు……

దీంతో ఒకరిద్దరు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తిరిగి పళని గూటికి చేరే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దినకరన్ కూడా అప్రమత్తమయ్యారు. తన వెంట ఉండే వారు ఎవరూ తిరిగి అక్కడకు వెళ్లరని నమ్మకంగా చెబుతున్నారు. వారిని తిరిగి గెలిపించుకునే బాధ్యత తనదేనంటూ భరోసా ఇస్తున్నారు. ఇటీవల అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలతో సమావేశమైన దినకరన్ త్వరలోనే వారిని శశికళ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచినా, గెలవకున్నా భవిష్యత్తు తాను చూసుకుంటానని చెబుతున్నారు. మొత్తం మీద 18 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఏ వైపు టర్న్ తీసుకుంటారో నన్న ది ఆసక్తిగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*