దినకరన్ ఊరుకుంటాడా?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కార్ కు ముప్పు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. పన్నీర్ సెల్వాన్నికలుపుకున్నప్పటికీ పళనిస్వామికి త్వరలోనే పదవీ గండం తప్పదన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి.అధికార అన్నాడీఎంకేలో అసమ్మతి ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ఆర్కే నగర్ లో టీటీవీ దినకరన్ గెలుపొందాక కొందరు ఆయన గూటికి వెళ్లిపోతారని భావించారు. కాని పళనిస్వామి అప్పట్లో ఎమ్మెల్యేలతో సమావేశమై కొంత శాంతబర్చే ప్రయత్నంచేశారు. మంత్రి పదవి దక్కని వాళ్లు కొందరైతే, మరికొందరు తమకు ప్రయారిటీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కోర్టు తీర్పు ఎలా వచ్చినా…..

ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే కోర్టు తీర్పు పళనిస్వామికి సంకటంగానే మారనుంది. ఆయనకు సరిపడా బలం శాసనసభలో లేకపోవడంతో విపక్షాలు సయితం మరోసారి బలపరీక్ష చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే అనర్హత విషయం పై ప్రస్తుతానికి కోర్టు తీర్పు వచ్చే వరకూ యధాతథస్థితి కొనసాగుతుంది. బలపరీక్ష విషయంలోనూ అంతే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తే రాష్ట్రంలో 18 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గెలవడం కష్టమే. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కాచుక్కూచ్చుని ఉంది. ఉప ఎన్నికలను ఎదుర్కొనే సామర్థ్యం, సత్తా పళనిస్వామికి, పన్నీర్ సెల్వానికి లేవన్న సంగతి ఆ పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. ఆర్కే నగర్ లోనే అధికార పార్టీ చేతులెత్తేయడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

ఎమ్మెల్యేలతో సమావేశాలు….

అలాగే అనర్హత వేటు వేయకుండా ఉన్నప్పటీకీ పళనిస్వామికి బలపరీక్షలో చిక్కులు తప్పేట్లు లేవు. డీఎంకే, దినకరన్ టీంలు ఒక్కటయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డీఎంకే కూటమికి 98 మంది సభ్యులుండగా దినకరన్ గూటిలో 19 మంది ఉన్నారు . మొత్తం సభ్యుల సంఖ్య 117 కు చేరుకుంటుంది. పళనిస్వామికి ప్రస్తుతం 113 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో కూడా పూర్తిగా మద్దతు తెలుపుతారన్న గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో రెండు, మూడురోజుల్లో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు శాసనసభ్యులతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. శాసనసభ్యులను వ్యక్తిగతంగా కలిసి వారి డిమాండ్లను పరిష్కరించే యోచనలో ఉన్నారు పళనిస్వామి.

దినకరన్ వ్యూహం ప్రకారం…..

కోర్టు తీర్పుతో కంగుతిన్న దినకరన్ కూడా ఈ పరిస్థితిని అడ్వాంటేజీగా తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే సానుభూతి పనిచేసి తమ సభ్యులు 18 మంది గెలుస్తారని ఆయన ధీమాగా చెబుతున్నారు. అన్నాడీఎంకేను భ్రష్టుపట్టిస్తున్న పళని, పన్నీర్ లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దినకరన్ అంటూనే తాను చెప్పినట్లుగానే మరి కొద్దిరోజుల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని జోస్యం కూడా చెబుతున్నారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా అది పళనిస్వామికి నష్టమేనని, తమకు చేసిన మోసానికి తగిన శిక్ష అనుభవించడానికి పళని, పన్నీర్ లు సిద్ధంగా ఉండాలని దినకరన్ సవాల్ విసిరారు. మొత్తం మీద తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 18166 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*