డీకే దుమ్ము దులిపేశారు….!

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఫైరయ్యారు. పీసీసీ చీఫ్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టిపారేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే నడవదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఇన్ ఛార్జి కుంతియా ముందే డీకే అరుణ దుమ్ము దులిపేశారు. ఇటీవల సీనియర్ నేతలకు తెలియకుండా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం, నేరుగా రాహుల్ ను కలసి ఫిర్యాదు చేయడం వంటి అంశాలపై పీసీసీ అత్యవసర సమావేశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు.

ఎవరిని అడిగి చేర్చుకున్నారు….?

ఈ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. డీకే అరుణ ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. సీనియర్లను పట్టించుకోకపోవడంపై ఆమె తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డిలను చేర్చుకునేందుకు ఆ జిల్లా నేతలైన తమను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. నాగం చేరి ఇన్ని రోజులవుతున్నా తమతో సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా గట్టిగా కోరారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పార్టీని వీడి వెళుతుంటే ఎందుకు ఆపలేకపోయారన్నారు. మీకిష్టం వచ్చిన నేతలను చేర్చుకుని, ఇష్టం లేని వారు వెళ్లిపోతుంటే ఆపే ప్రయత్నం చేయరా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

ఎందుకు చేర్చుకోరు….?

అలాగే జడ్చర్ల నుంచి ఎర్ర శేఖర్, నారాయణఖేడ్ నుంచి శివకుమార్ లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నా ఎందుకు చేర్చుకోవడం లేదన్నారు. ఈ విషయంపై తనకు ఇప్పుడే స్పష్టత కావాలని పట్టుబట్టారు. వారి చేరికకు ఎవరు అడ్డుపడుతున్నారో తనకు తెలుసునన్నారు. దీంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాక్కయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ కూడా కొంత ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు. పీసీసీ అధ్యక్షుడు లేకుండా ఢిల్లీ వెళ్లి రాహుల్ ను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. దీనికి మల్లు భట్టి విక్రమార్క గట్టిగానే సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎవరైనా కలవచ్చని తెలిపారు. దీంతో వాగ్వాదం ముదురుతుండటంతో జానారెడ్డి కొంత శాంతింప చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఉత్తమ్ వ్యవహార శైలిపై సీనియర్ నేతల్లో ఇప్పటివరకూ ఉన్న అసంతృప్తి ఈ సమావేశంలో బయటపడింది.