డీకే ట్విస్ట్ మీద ట్విస్ట్…!

ఇక్కడ గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పేవీలుంటుంది. కుదిరితే మంత్రి పదవి కూడా కొట్టేయచ్చు. ఈ స్థానం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ సీట్ గా మారింది. ఒకరిపై ఒకరు చేయి సాధించడానికి వైరి పక్షాన్ని దెబ్బతీయడానికి ఈ సీటు చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. అందుకే ఇప్పటి నుంచే హస్తినలో లాబీయింగ్ స్టార్ట్ చేశారు హస్తం పార్టీ నేతలు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం అంటే అందరికీ మక్కువే. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే మంచి పదవులు లభిస్తాయన్న గ్యారంటీ ఉంది. గత ఎన్నికల ఫలితాలు కూడా ఇవే స్పష్టం చేస్తుండటంతో మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ తీవ్రమయింది.

ఇక్కడ గెలిస్తే…..

మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దగ్గర నుంచి జైపాల్ రెడ్డి, మల్లికార్జున్, జితేందర్ రెడ్డి వంటి వారు గెలిచారు. జైపాల్ రెడ్డి, మల్లికార్జున్ లు ఇక్కడ గెలిచి కేంద్ర మంత్రులు కాగా, జితేందర్ రెడ్డి ప్రస్తుతం లోక్ సభలో పార్టీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో సీనియర్ నేత జైపాల్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయకుండా మాజీ మంత్రి డీకే అరుణ ఇప్పటి నుంచే ఫిట్టింగ్ లు మొదలెట్టేశారు. తనకు గాని, తన కూతురు సిగ్దారెడ్డికి గాని మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో అవకాశమివ్వాలని ఇప్పటికే అధిష్టానానికి తెలియజేశారు. ఎంపీ స్థానం తన కుటుంబం చేతిలో ఉంటే జైపాల్ రెడ్డికి చెక్ పెట్టవచ్చన్నది డీకే అరుణ వ్యూహం.

రెండుసార్లు గెలిచి……

అయితే సీనియర్ నేత జైపాల్ రెడ్డికి అధిష్టానం వద్ద మంచి పట్టుంది. ఆయనను కాదని ఇచ్చే ధైర్యం హైకమాండ్ చేస్తుందా? అన్నది ప్రశ్న. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. కొడంగల్, మక్తల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర, షాద్ నగర్ నియోజకవర్గాలుండగా వీటిలో డీకే కుటుంబానికి పట్టుంది. 1957 నుంచి ఇప్పటి వరకూ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరగ్గా మల్లికార్జున్, జి.రామేశ్వరరావులు మూడు దఫాలు, జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు రెండుసార్లు విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానాన్నికోల్పోవడానికి కారణం జైపాల్ రెడ్డి అని డీకే అరుణ గట్టిగా అధిష్టానానికి చెబుతున్నారు.

అనేకమంది పోటీ……

అయితే మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి జైపాల్ రెడ్డి పేరు ముందుఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చినా, రాకున్నా హస్తినలో ఆయన గొంతు అవసరమని అధిష్టానం భావిస్తోంది. కాని అనేక మంది ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి అవసరమైతే తాను ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్నారు. టీడీపీలో ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డికి వనపర్తి స్థానం కేటాయించి తాను ఎంపీగా వెళతానని చిన్నారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారెడ్డితో పాటు బీసీకోటాలో ఎన్టీఆర్ ను ఓడించిన చిత్తరంజన్ దాస్, నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లు కూడా పాలమూరు ఎంపీ స్థానంపై కన్నేశారు. ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు పట్టుండటంతో పోటీ తీవ్రమయిందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*