నమ్మినబంటుకు నజరానా దక్కేనా..?

డీకే.శివకుమార్… కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకునే కన్నడ లీడర్. కేవలం కన్నడ నాట మాత్రమే కాదు. ఇతర రాష్ట్రాల్లో పార్టీకి ఇబ్బందులు వచ్చినా ఆయన పార్టీ మేలు కోసం తన శక్తిమేర పనిచేశాడు. ఇందుకు బహుమతిగా ఆయన కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి, సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ వేధింపులకు గురయ్యాడనేది ఆయన వర్గం నేతల వాదన. ఈ వాదనను ఎక్కువమంది నిజమేనని నమ్ముతారు. అయినా కూడా పార్టీ పట్ల తన విధేయత విషయంలో మాత్రం డీకే ఎప్పుడూ వెనక్కుతగ్గలేదు. భయపడలేదు. అయితే, ఇంత చేసిన డీకే ను కాంగ్రెస్ ఎంతమేర గుర్తిస్తుందా..? ఆయన కోరికలు నెరవేరుస్తుందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ప్రభుత్వ ఏర్పాటులో కీలకం…

గతంలో మహారాష్ట్రలో విలాస్ రావు దేశ్ ముఖ్ ప్రభుత్వం ప్రమాదంలో పడినప్పుడు, గత సంవత్సరం జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంది శివకుమారే. ఇటీవలి కర్ణాటక పరిణామాల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అధికారం చేపట్టడంలో ఆయన పాత్ర కూడా తెలిసిందే. బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిక్కకుండా ఆయన కంటికి రెప్పల్లా కాపాడారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గుర్తించింది. అయితే, డీకే.శివకుమార్ ఆశిస్తున్న పదవులు మాత్రం ఇవ్వలేకపోతోంది. డీకేకు మొదట ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నా వొక్కలిక సామాజికవర్గానికే చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండటంతో డీకే ఆశలు అడియాసలయ్యాయి.

జోడు పదవులు దక్కేనా..?

ఉపముఖ్యమంత్రి పదవి చేజారినా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్ష పదవితో పాటు ముఖ్యమైన పోర్టు ఫోలియోను శివకుమార్ ఆశించారు. అయితే బుధవారం జరిగిన మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో డీకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముఖ్యమైన ఇరిగేషన్ శాఖతో పాటు వైద్య విద్య శాఖలు కేటాయించారు . శివకుమార్ మాత్రం ఇరిగేషన్ తో పాటు బెంగళూరు అభివృద్ధి శాఖ ఆశించారు. దీంతో ఆయన ఆశించిన పోర్టు ఫోలియోలు పూర్తిగా దక్కలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో, ప్రజల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి కూడా దక్కడం అనుమానమే అని తెలుస్తోంది. ఆయనకు జోడు పదవులు ఇవ్వడాన్ని కొందరు కాంగ్రెస్ నేతలే వ్యతిరేకిస్తున్నారు. దీంతో కేపీసీసీ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ కూడా డీకేకు భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తమ నేతను అవమానిస్తున్నారని డీకే శివకుమార్ వర్గం ఆగ్రహంగా ఉంది. అయితే, శివకుమార్ కనుక పార్టీకి వ్యతిరేకంగా మారితే కర్ణాటకలో పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తప్పవు. ఇక, శివకుమార్ కు రెండు పదవులు ఇస్తారా, లేదా ఒకే పదవితో సంతృప్తి పరుస్తారా అనేది చూడాలి.