ఆయన దెబ్బ ఎవరికి లాభం? నష్టం..?

తమిళనాడులో వచ్చే ఉప ఎన్నికలు ఎవరికి దెబ్బకొడతాయన్నది ఆసక్తిగా మారింది. అధికార అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయింది. కమలం పార్టీపై ఉన్న వ్యతిరేకతతో తాము ఆపార్టీతో కలసి వెళ్లకూడదన్న నిర్ణయానికి దాదాపు వచ్చేసింది. త్వరలో జరగనున్న 20 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు అన్నాడీఎంకే ప్రభుత్వ మనుగడకే ఎసరు తెచ్చిపెట్టే అవకాశముంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పళనిస్వామికి మెజారిటీ సభ్యుల బలం ఉంది. అయితే ఉప ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కనీసం ఎనిమిది స్థానాలనైనా కైవసం చేసుకోకుంటే పదవికి గండం తప్పదు.

ఒంటరిగా కమల్…..

మరోవైపు కమల్ హాసన్ ఇటీవల మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కమల్ హాసన్ తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. అయితే నిన్న మొన్నటి దాకా కమల్ హాసన్ డీఎంకే కూటమిలో చేరతారన్న ఊహాగానాలు విన్పించాయి. అయితే కమల్ హాసన్ తాజా ప్రకటనతో మక్కల్ నీది మయ్యమ్ కూడా ఒంటరిగానే పోరుకు దిగనుంది. ముఖ్యంగా యువనేతలను, కొత్త నేతలను పోటీలోకి దించాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఆయన ఇటీవల వరుసగా కళాశాల మీటింగ్ లకు హాజరవుతూ యువతను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

కూటమితో డీఎంకే…….

ఇరవై లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుక డీఎంకే కూడా సమాయత్తమవుతోంది. డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో కలసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళనాడులోనూ మహాకూటమి రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఉప ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే ఎవరికి దెబ్బ అన్న చర్చ జోరుగా సాగుతోంది. అధికార అన్నాడీఎంకే పార్టీ ఓట్లను చీల్చుకుంటే పళనిస్వామికి ఎదురుదెబ్బ తప్పదు. అలాకాకుండా విపక్ష ఓట్లను చీల్చగలిగితే పళనిస్వామి ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే.

తేల్చని రజనీ……

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ విషయమూ తేల్చలేదు, ఆయన వచ్చే నెలలో పార్టీని ప్రకటించే అవకాశముంది. అయినా రజనీకాంత్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోగాని, ఉప ఎన్నికల్లో గాని పోటీ చేసే అవకాశముండదు. ఆయన దృష్టంతా శాసనసభ ఎన్నికలపైనే ఉంది. అప్పటి వరకూ పార్టీని బలోపేతం చేయాలని రజనీ ఆలోచనగా ఉంది. దీంతో ఉప ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశముంది. అన్నాడీఎంకే, డీఎంకే, మక్కల్ నీది మయ్యమ్ తో పాటు దినకరన్ పార్టీ పోటీ చేస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. 20 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ అన్నాడీఎంకేవే కావడం గమనార్హం. వీటిలో 18 సీట్లు దినకరన్ వర్గానికి చెందిన నియోజకవర్గాలు. ఇలా చతుర్ముఖ పోటీ ఎవరికి లాభిస్తుందన్నది వేచిచూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*