నేత‌ల‌కు రంగు ప‌డింది.. కరెక్టేగా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా తీసుకున్న సంచ‌ల‌న‌ నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా రాజ‌కీయ నేత‌ల‌కు షాకిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ల్ మోహ‌న్ రంగా అటూ నేత‌లు వారి ఇష్టారాజ్యంగా మార్చుకున్న ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఫాలో కావాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు నేత‌లు త‌మ గెలుపే ధ్యేయంగా అనుస‌రిస్తూ. వ‌స్తున్న విధానాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా బుట్ట దాఖ‌లు చేసింది. నిజానికి దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన నాటి నుంచి ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా నేత‌లు ఒక‌టికి మించి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

ఏకకాలంలో పోటీపై….

ఒక స్థానంలో ప్ర‌జాద‌రణ కోల్పోయి ఓడినా.. మ‌రో స్థానం నుంచి గెలుపొంద‌వ‌చ్చ‌నే ల‌క్ష్యంతో నేత‌లు రెండు స్థానాల నుంచి పోటీ చేయ‌డం ఇందిరమ్మ హ‌యాం నుంచి దేశంలో కొన‌సాగుతోంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లోనూ ఇదే విధానం కొన‌సాగింది. ప్ర‌ధానులుగా దేశాన్ని పాలించిన ఇందిర‌, పీవీ న‌ర‌సింహారావు కూడా రెండు స్థానాల నుంచి ఏక‌కాలంలో పోటీ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇందిర ఏక కాలంలో యూపీలోని రాయ్‌బ‌రేలి నుంచి తెలంగాణ‌లోని మెద‌క్ నుంచి అప్ప‌ట్లో పోటీ చేశారు. అదేవిధంగా పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధాని కాక‌ముందు.. క‌ర్నూలు జిల్లా నంద్యాల నుంచి అదే స‌మ‌యంలో అప్ప‌టి ఎన్నిక‌ల్లోనే ఒడిశాలోని బ‌రంపురం నియోజక‌వ‌ర్గం నుంచి ఏక‌కాలంలో పోటీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ…

ఇక టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ ఒకేసారి మూడు చోట్ల పోటీ చేసి మూడు చోట్లా కూడా గెలుపొందారు. 2007లో ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. 2009 ఎన్నిక‌ల్లో.. ప‌శ్చిమ‌గోదావ‌రిలోని సొంత నియోజ‌క‌వ‌ర్గం స‌హా తిరుప‌తి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేశాడు. తిరుప‌తి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ అటు ఎంపీగాను, ఇటు ఎమ్మెల్యేగాను కూడా పోటీ చేశారు. ఇలా నేత‌లు త‌మ ఇష్టారాజ్యంగా ఎన్నిక‌లను వినియోగించుకుంటున్నారు. అయితే, దీనిపై ఎప్ప‌టి నుంచో కొన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలా రెండు చోట్ల నుంచి ఎన్నికైన అభ్య‌ర్థి ఏదో ఒక స్థానం మాత్ర‌మే ఉంచుకుని మ‌రో దానికి రాజీనామా చేయాలి.

మళ్లీ ఎన్నికలు తప్పంచాలని…..

దీంతో ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌ద‌రు స్థానంలో తిరిగి నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఫ‌లితంగా ప్ర‌జాధ‌నం వృధాతో పాటు ఎన్నిక‌ల సంఘంపై అద‌న‌పు భారం ప‌డుతోంది. దీనిపై అనేక స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌హా ప‌లువురు మేధావులు సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కొంద‌రు ఇదే విష‌యంపై సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని విచారించిన సుప్రీం కోర్టు ఈ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం అభిప్రాయాన్ని కోరింది. ఒక్కో అభ్యర్థి ఒక్క స్థానం కోసం మాత్రమే పోటీచేయాలన్న ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్టు ఎన్నిక‌ల సంఘం సుప్రీంకోర్టుకు నివేదించింది.

ఓటర్లకు అన్యాయం చేయడమే…..

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి అటు ఎంపీ స్థానంతో పాటు ఇటు ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా పరిమితం చేయాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)కు సమాధానంగా ఈసీ ఈ మేరకు వెల్లడించింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఓ నియోజక వర్గాన్ని వదిలి మరో స్థానానికి వెళ్లడం ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఈసీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ ప‌రిణామంతో మ‌రో ఏడాది లేదా అంత‌క‌న్నా ముందే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇదే జ‌రిగితే.. నేత‌ల ప‌ని గోవిందా! అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*