శబ్ద యుద్ధమే నిశ్శబ్దం లేదంట…!!

ఇప్పుడు తెలంగాణాలో ముందస్తు ఎన్నికల చర్చ ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది. గత నెలరోజులుగా అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటూ రాబోయే ఎన్నికల్లో తలపడేందుకు నువ్వా నేనా అంటున్నాయి. విపక్ష కాంగ్రెస్ నేతలు పదునైన వ్యాఖ్యలతో టి సర్కార్ పై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కుటుంబ పాలనలో సాగుతున్న టి సర్కార్ ని ప్రజలు బొంద పట్టేందుకు సిద్ధంగా వున్నారని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నిశ్శబ్ద విజయం సాధిస్తుందన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ తనదైన శైలిలో కౌంటర్లు విసిరారు.

కెటిఆర్ మాటల తూటాలు …

కెసిఆర్ తనయుడు మంత్రి కెటిఆర్ ప్రత్యర్థులకు ధీటైన సమాధానాలు ఇవ్వడంలో బాగా ఆరితేరారు. నిన్న మొన్నటివరకు ఎన్నికలకు పోదాం…. ప్రజాక్షేత్రంలో కి వెళదాం అన్న పార్టీలు ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయంటే ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నిశ్శబ్ద యుద్ధం అని చెబుతుందని…. రాబోయేది శబ్ద యుద్ధమేనని కేటీఆర్ అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ గూబ గుయ్యి మనే తీర్పుతో గట్టిగా బుద్ధి చెబుతారంటూ ఎదురుదాడికి దిగారు కెటిఆర్. ఇక తమది కుటుంబ పాలన అయితే కాంగ్రెస్ పార్టీది ఏ పాలనలో చెప్పాలని మోతిలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ వీరంతా ఎవరని ప్రశ్నించారు. రాహుల్ చివరన గాంధీ లేకపోతే ఆయనకు రాజకీయాల్లో గుర్తింపు ఎక్కడిదని కడిగేశారు. తమను ప్రజలు ఆమోదించారని గుర్తు చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా రాహుల్ ఉద్యమించిన చరిత్ర ఏముందని తాను వరంగల్ జైల్లో వున్న విషయం మరిచిపోవొద్దన్నారు. సీల్డ్ కవర్ సంస్కృతి ఢిల్లీ సంస్కృతి కాంగ్రెస్ ది అయితే టీఆరెస్ ఢిల్లీ పార్టీ కాదని గల్లీల్లో లీడర్ లు వున్న పార్టీ అంటూ మాటల దాడి తీవ్రం చేశారు.

విహెచ్ విసుర్లు ….

మంత్రి కెటిఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పైనా విరుచుకుపడ్డారు. ఐదేళ్ళు వుండాలని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అడుగడుగునా తెలంగాణాలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని దుయ్యబట్టారు. ఇలా ఒకరిపై మరొకరు సభలు సమావేశాల్లో చేస్తున్న ఆరోపణలు విమర్శలతో తెలంగాణాలో ఎన్నికల వేడి ఎలాంటి ప్రకటనలు లేకుండానే తారాస్థాయికి చేరింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*