అదే జరిగితే ఎవరిది గెలుపు…?

మళ్లీ మొదలైంది. కొంతకాలం పాటు సద్దుమణిగిన హడావిడి మళ్లీ ఊపందుకుంది. ముందస్తు ముచ్చట నాయకుల నోళ్లలో నానడమే కాదు, చర్చలకు దారి తీస్తోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ అతిగా స్పందించే తెలుగు రాష్ట్రాల్లో ఈ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేతలు ఒకవైపు అంతర్గత మంతనాలు సాగిస్తున్నారు. ముందస్తు వచ్చేందుకు గల అవకాశాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. పార్టీల వారీ ఊహాగానాలూ ఊపందుకున్నాయి. అన్నిపార్టీలు గెలుపు సర్వేలను ప్రారంభించాయి. టిక్కెట్లు ఆశిస్తున్న కొందరు అభ్యర్థులు పార్టీల వారీ అవకాశాలపై నియోజకవర్గాల వారీ ప్రయివేటు సర్వేలకు తెర తీస్తున్నారు. మోడీ ఇందుకు ముహూర్తం పెట్టబోతున్నట్లుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్, చంద్రబాబు ల వద్ద ఇందుకు సంబంధించి తగిన సమాచారం ఉందని పార్టీల నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ యోచన …

గడచిన కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. దేనికైనా సిద్దంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే మూడు సర్వేలు పూర్తి చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. నరేంద్రమోడీని కలిసి వచ్చిన తర్వాత ఈ విషయంలో మరింత స్పష్టత కనబరుస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. పార్టీపరంగా నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ 45 నుంచి 52 శాతం వరకూ టీఆర్ఎస్ కు ఓటింగు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలిందంటున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో 35 నుంచి 45 వేల వరకూ ప్రత్యర్థి పై ఆధిక్యత వచ్చే రీతిలో సర్వేల పలితాలుకనిపిస్తున్నాయనేది సమాచారం. అయితే ఇవన్నీ పార్టీ సర్వేలు కావడంతో కొంత పక్కదారి పట్టించే ప్రమాదమూ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ తో విడిగా సర్వే చేయించారని తెలుస్తోంది. అందులోనూ టీఆర్ఎస్ దే పైచేయిగా తేలడంతో ఇక ముందస్తుకు వెళ్లవచ్చనే అవగాహనకు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెసుకు కేసీఆర్ ముందస్తుకు రెడీ నా అంటూ సవాల్ విసరడంలో ఆంతర్యమిదేనని పార్టీ నాయకులు స్పష్టత నిస్తున్నారు.

బాబు సూచన…

చంద్రబాబు ఇప్పటికి నాలుగు నెలల ముందునుంచే నాయకులకు సంకేతాలిస్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో, రాష్ట్రస్థాయి , సమన్వయకమిటీల సమావేశాల్లో పలుదఫాలుగా ముందస్తు అవకాశాలపై చంద్రబాబునాయుడు ప్రసంగించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలను గడచిన పక్షం రోజులుగా నిర్వహిస్తున్నారు. తాజాగా మరో కొత్త ప్రణాళికను బయటికి తీశారు. 15 రోజులకు ఒక జిల్లా పర్యటనను ప్లాన్ చేస్తున్నారు. ఆ జిల్లాలో రెండు రోజులపాటు మకాం చేస్తారు. ఒక రోజు ఫీల్డు లెవెల్ లో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు, గ్రామసందర్శన చేస్తారు. పూర్తిగా ఒకరోజున పార్టీ కార్యక్రమాలకే కేటాయిస్తారు. జిల్లాల పర్యటనలో ఒకరోజును పూర్తిగా పార్టీకి కేటాయించడం ఇదే తొలిసారి. తద్వారా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలనే యోచనలో ఉన్నారు. నాయకుల మద్యవిభేదాలను తొలగించడం, గెలుపు అవకాశాలపై క్రోడీకరణ, అభ్యర్థుల మార్పుచేర్పులపై ఈ సమావేశాల్లో దృష్టిసారిస్తారని తెలుస్తోంది. పార్టీ నాయకులంతా నవంబరు నాటికే ఎన్నికల విషయంలో సర్వసన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు క్యాడర్ కు ఆదేశిస్తున్నారు.

మోడీ ..మదిలో…

ముందస్తు ఆలోచన మొగ్గ తొడిగిందే ప్రధాని నరేంద్రమోడీ మదిలో అని చెబుతున్నారు. జమిలి ఎన్నికల అంశాన్ని నీతిఅయోగ్ లో ఆయన ప్రస్తావించారు. జాతీయ పార్టీలు లాభం పొందాలంటే ఒకేసారి దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిపితే ప్రయోజనదాయకమనేది ఒక అంచనా. రెండేళ్ల క్రితమే ఈ ఏకకాల ఎన్నికలపై ప్రస్తావన మొదలైంది. మోడీ ఇమేజ్ తగ్గుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ల అసెంబ్లీల ఎన్నికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కాలవ్యవధి ముగిసిన తర్వాత డిసెంబరులో రాజ్యాంగ బద్ధంగా వీటి ఎన్నిక నిర్వహించి తీరాల్సిందే. ఫలితం రివర్సు అయితే దేశంలో నెగటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఇమేజ్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది. లోక్ సభ ఎన్నికలు ఎదురీతగా మారుతాయి. అందువల్ల ముందస్తు జరిపితే తప్ప బీజేపీ గట్టెక్కలేదనేది రాజకీయ అవగాహన. దీనిపైనే బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మోడీ, అమిత్ షా లు ఇటువంటి నిర్ణయాల్లో తమ మాటను నెగ్గించుకుంటుంటారు. అయితే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి బీజేపీ దెబ్బతింది. అదొక్కటే కొంత మేరకు సంశయాలకు కారణమవుతోంది. ఏదేమైనప్పటికీ వర్షాకాల సమావేశాల తర్వాత ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*