నాని…బుజ్జి…ఎవరికి ఛాన్స్….??

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు సెంటిమెంట్‌ రాజకీయాలకు కేరాఫ్‌. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ 1983లో సీహెచ్‌. రంగారావు 1985లో మరడాని రంగారావు టీడీపీ నుంచి విజయం సాధించగా స్టేట్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1989లో నేరెళ్ళ రాజా కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. 1994లో టీడీపీ నుంచి మరో సారి మరడాని రంగారావు, 1999లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ టీడీపీ నుంచి గెలిచారు. 2004, 2009లో ఆళ్ల నాని కాంగ్రెస్‌ నుంచి వరుస విజయాలు సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన బడేటి కోట రామారావు (బుజ్జి) తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. ఈ క్రమంలోనే ఇక్కడ గెలిచిన పార్టీయే స్టేట్‌లో అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. గతంలో టీడీపీలో ఉన్న బుజ్జి 2009 ఎన్నికల టైమ్‌లో ప్రజారాజ్యంలోకి జంప్‌ చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.గత ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలోకి జంప్‌ చేసి 24వేల ఓట్ల భారీ మెజారిటీతో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై ఘన విజయం సాధించారు.

అవినీతి ఆరోపణలే…..

నాలుగున్నర ఏళ్లల్లో నియోజకవర్గంలో చూస్తే ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనుల కన్నా అవినీతి, ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు లెక్కకు మిక్కిలిగా వస్తున్నాయి. బడేటి బుజ్జి పాలనలో అభివృద్ధి వెనుక అవినీతి, కమీషన్ల పర్వం జోరుగా కొనసాగుతుందన్నది నియోజకవర్గ జనాలందరికి తెలుసు. నియోజకవర్గంలో రౌడీయిజం పేట్రేగిందన్న ఆరోపణలు ఉన్నాయి. భూదందాలు, భూసెటిల్‌మెంట్లు, రెండు, మూడు హత్యల వెనక కూడా అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్టు నియోజకవర్గ జనాలు జోరుగా చ‌ర్చించుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో నాలుగేళ్ల బుజ్జి పాలన కన్నా అంతకు ముందు జరిగిన కాంగ్రెస్‌ పాలనలోనే మెజారిటీ అభివృద్ధి పనులు, పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఇక దివంగత లెజెండ్రీ నటుడు ఎస్వీ. రంగారావుకు మనవడు అయిన బుజ్జి ఇటు మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. గతంలో ప్రజారాజ్యంలోకి వెళ్లిన అనుబంధం నేపథ్యంలో ఇటు జనసేనతోను ఆయన టచ్‌లో ఉన్నాడన్న టాక్‌ లేకపోలేదు.

బుజ్జి పార్టీని వీడితే….

ప్రస్తుతానికి టీడీపీ వరకు నియోజకవర్గంలో బుజ్జి బలమైన వ్యక్తిగా ఉన్నా ఆయన వచ్చే ఎన్నికల్లో ఏమైనా యూటర్న్‌ తీసుకుంటాడా ? అన్న సందేహం కూడా ఉంది. టీడీపీ నుంచి బుజ్జి కాకపోతే ఏలూరు నగర మేయర్‌ నూర్జహాన్‌ భర్త ఎస్‌ఎమ్‌ఆర్‌. పెదబాబు సీటు కోసం కాచుకుని కూర్చుని ఉన్నారు. పెదబాబు ఆర్థిక కోణంలోనూ బలంగా ఉండడం ప్లస్‌ కానుంది. విపక్ష వైసీపీ విషయానికి నియోజకవర్గంలో 1994, 1999, 2004, 2009, 2014 గత ఎన్నికల్లోనూ పోటీ చేస్తు సంస్థాగతంగా పార్టీతో సంబంధం లేకుండా కొంత వ్యక్తిగత ఇమేజ్‌ ఏర్పర్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రస్తుతం ఎమ్మెల్సీగానూ, జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నానిని ఇన్‌చార్జ్‌గా తప్పించి మాజీ మున్సిపల్‌ చైర్‌ప‌ర్స‌న్‌ మధ్యాహ్న‌పు ఈశ్వరీ బలరామ్‌కు నియోజకవర్గ సమన్వయకర్త పగ్గాలు అప్పగించారు.

నాని గట్టి పోటీ…..

అయితే ఆమె వల్ల పార్టీ బలోపితం కాలేదని గ్రహించిన జగన్‌ తిరిగి నానికే నియోజకవర్గ పగ్గాలు అప్పగించడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక జనసేన విషయానికి వస్తే నియోజకవర్గంలో పార్టీకి సంస్థాగతంగా బలంగా లేకపోయినా పవన్‌ అభిమానులు, సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో సరైన అభ్యర్థుని నిలబెడితే జనసేన కూడా గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాల అంచనా. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆ పార్టీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలవడం విశేషం. దీనిని బట్టి ఇక్కడ జనసేన కూడా ప్రధాన పార్టీలకు ధీటుగానే పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైన ఏలూరులో మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన అభ్యర్థిని నిలబెడితే మూడు పార్టీల మధ్య‌ ట్రైయాంగిల్‌ ఫైట్‌ తప్పదు. మరి ఎన్నికల వేళ‌ ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదానిని బ‌ట్టి కూడా ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*