ఎర్ర‌బెల్లిని ఓడించేందుకు ఆ ఇద్ద‌రూ..!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అందులోనూ అధికార టీఆర్ఎస్ పార్టీలో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత‌పార్టీలో అస‌మ్మ‌తి కుంప‌టి రోజురోజుకూ ముదిరిపాకాన ప‌డుతోంది. ప‌లువురు సీనియ‌ర్లు తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు వ్య‌తిరేకంగా అంత‌ర్గతంగా పావులు క‌దుపుతున్నారు. పైకి సాఫ్ట్‌గా మాట్లాడుతూనే లోలోప‌ల హార్డ్‌వ‌ర్క్ చేస్తున్నారు. ఇందులో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కోణం కూడా ఉంది. అదేమిటంటే.. టీఆర్ఎస్ నేత‌ల్లో ఒక‌రు.. ప్ర‌త్య‌ర్థితో చేతులు క‌లిపి ఎర్ర‌బెల్లిని ఓడించేందుకు ప‌క్కా ప్లాన్ వేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డం. ఇదంతా చూస్తుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాల‌కుర్తిలో ఎర్ర‌బెల్లి గెలుపు మాత్రం అంత సులువు కాద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

జంగా నుంచి పోటీ…..

నిజానికి 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, టీఆర్ఎస్ నుంచి నెమురు గొమ్ముల సుధాక‌ర్‌రావు బ‌రిలోకి దిగారు. కొద్దిపాటి తేడాతో ఎర్ర‌బెల్లి విజ‌యం సాధించారు. ఇక ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో తృటిలో ఓట‌మి నుంచి త‌ప్పించుకున్నఆయ‌న ఈసారి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ సీన్ రిపీట్ కావొద్ద‌న్న ల‌క్ష్యంతో నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ.. సీఎం కేసీఆర్ ను ఒప్పించి, ప్రత్యేక నిధులు తెప్పించి, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయితే.. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆయ‌న‌కు కాంగ్రెస్ నేత జంగా రాఘ‌వ‌రెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదుర‌వుతోంది. జంగా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఎర్రబెల్లికి గ‌ట్టి పోటీని ఇస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో జంగా దూకుడుతో ఎర్ర‌బెల్లికి కంటిమీద కునుకు కూడా ప‌ట్ట‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

ఎర్రబెల్లికి సవాల్…..

ఇదిలా కొన‌సాగుతుండ‌గానే.. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. టీఆర్ఎస్ పార్టీ ఉమ్మ‌డి జిల్లా అధ్య‌క్షుడు త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు పాల‌కుర్తి టికెట్ ఆశిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ఆయ‌న ఇక్క‌డ పోటీ చేయాల‌ని క‌ల‌లు క‌న్నారు. ఇప్పుడు ఎర్ర‌బెల్లి పార్టీ మారి త‌న సీటుకే ఎస‌రు పెట్ట‌డంతో ఆయ‌న ఎర్ర‌బెల్లిపై ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఎర్ర‌బెల్లికి సీటు ఇచ్చాక‌ ఏకంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ.. ఎలాగైనా టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని కోరుతున్నారు. త‌న‌కు పాల‌కుర్తి టికెట్ ఇచ్చి… వ‌రంగ‌ల్ తూర్పు నుంచి ఎర్ర‌బెల్లిని బ‌రిలోకి దిగాల‌ని కోరుతున్నారు. ఎర్ర‌బెల్లి వ‌రంగ‌ల్ తూర్పులో పోటీ చేసి త‌న ఆగ‌ర్భ శ‌త్రువు అయిన కొండా సురేఖ‌ను ఓడించాల‌ని స‌వాల్ విస‌రుతున్నారు.

కాంగ్రెస్ కనుసన్నల్లోనే……

ఈ ప‌రిణామాల‌తో పార్టీవ‌ర్గాల్లో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అంతేగాకుండా.. పాత టీఆర్ఎస్ క్యాడ‌ర్‌ను ఎగేసే ప‌నిలో ఉన్నారు త‌క్క‌ళ్ల‌ప‌ల్లి. ఉద్య‌మ‌కారుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. ఇప్ప‌టికైనా గుర్తింపు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే.. ఇదంతా కూడా కాంగ్రెస్ నేత జంగా క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తోంద‌ని, జంగా, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి కుమ్మ‌క్కు అయ్యార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీని నుంచి ఎర్ర‌బెల్లి ఎలా బ‌య‌ట‌ప‌డుతారో చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*