ఆయన వచ్చేయడం ఖాయమేనా.. !

సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీలో ప్రధాన పార్టీల మధ్య ఎత్తులు పైఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయం హీటెక్కిపోతోంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్‌ చేస్తారో కూడా ఊహించడం కష్టంగానే ఉంది. ఎవ‌రు ఎవ‌రిని క‌లిసినా లెక్క‌లేన‌న్ని సందేహాల‌కు తావిస్తోంది. ఇటీవల మాజీ డీజీపి నండూరి సాంబశివరావు వైసీపీ అధినేత జగన్‌ను కలవడంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. చివరకు ఆయన తాను వైసీపీలోకి వెళ్లడం లేదని వివరణ ఇచ్చుకునే వర‌కు పరిస్థితి వెళ్లింది. ఈ క్రమంలోనే ఎవరు ఎవరితో మీట్‌ అయినా, పార్టీ మారిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మాజీ డీజీపి సాంబశివరావు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అవ్వడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

గంటాతో మంతనాలు ఏంటి?

వీరిద్దరి మధ్య భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధన్యత లేదని చెబుతున్నా సాంబశివరావు గంటాను కలవడం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చనీయ అంశంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య ఏమి జరిగిది అన్నది మాత్రం బయటకు రాలేదు. ఇటీవల మాజీ డీజీపి సాంబశివరావు విశాఖపట్నం జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారని, ఆయన వైసీపీలో చేరతారని… వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఆ పార్టీ తరుపున పోటీ చేస్తారని ఒకటే ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ నేతలు ఒక్క సారిగా ఎలర్ట్‌ అయ్యారు. ఆ తర్వాత సాంబశివరావు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన జగన్‌తో ఏమి మాట్లాడారో, చంద్రబాబుతో ఏమి మాట్లాడారో తెలియదు గానీ ఇప్పుడు ఏపీ మంత్రి గంటాతో మీట్‌ అవ్వడం మరో సారి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జనసేనలోకి వెళతారా?

గంటా అంటేనే రాజకీయాల్లో నిలకడ లేని మనిషి. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఎవ్వరు ఊహించలేరు. రాజకీయంగా జనాల ఊహలకే అందని గంటా కేవలం సామాజిక ఈక్వేషన్లతోనే ఎన్నిక‌ల్లో నెట్టుకొచ్చేస్తున్నారు. గంటా, సాంబశివరావు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో వీరిద్దరి భేటీపై రాజకీయంగా అనేక అనుమానాలు తలేత్తడం సహజమే. టీడీపీలో వచ్చే ఎన్నికల్లో సరైన ప్రాధన్యత లేకపోతే ఆయన పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేనలోకి వెళ్లిపోతారన్న ప్రచారం ఎప్పట్నించో ఉంది. ఇప్పుడు ఉన్న‌ పరిస్థితిలో గంటా జనసేనలోకి వెళ్లినా తనతో పాటు తన అనుచరులకు సీట్లు ఇప్పించుకుని వారిని గెలిపించుకోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యంలోనూ గంటా అలాగే గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రమంలో తన సామాజికవర్గానికి చెందిన మాజీ ఉన్నత అధికారైన సాంబశివరావుతో గంటా భేటీ అవ్వడం చూస్తుంటే వచ్చే ఎన్నికల వేళ‌ ఏపీలో ఎలాంటి రాజకీయ సంచల‌నాలు అయినా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అయితే సాంబ‌శివ‌రావు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టే తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*